Chandrababu Satirical Comments On YCP: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చీరాలలో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేస్తామని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయడు వెల్లడించారు. బాపట్ల జిల్లా చీరాల, గుంటూరు జిల్లాల్లో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో మాట్లాడిన ఆయన వైసీపీపై నిప్పులు చెరిగారు. గంజాయి, డ్రగ్స్‌ను వంద రోజుల్లో ఉక్కుపాదంతో అణచివేస్తామని హామీ ఇచ్చారు. గంజాయి మాఫియా రాష్ట్రం వదిలి పారిపోయే పరిస్థితి తెస్తామన్నారు. రౌడీయిజం ద్వారా రాజకీయాలు చేయాలని భావిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీని చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలపాలని పిలుపునిచ్చారు.
వైసీపీ అధికారంలోకి వచ్చింది మెుదలు సీఎం జగన్ ఇష్టానుసారం జే బ్రాండ్లు పెట్టి రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. కల్తీ మద్యం తాగడం ద్వారా రాష్ట్రంలో 30 వేల మంది ఆడబిడ్డల తాళిబొట్లు తెగిపోయాయని పేర్కొన్నారు. భవన నిర్మాణ కార్మికులు పని దొరక్క ఆత్మహత్యలు చేసుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని నియంతలా పాలించాలనుకున్నారని, విధ్వంసం చేయడమే జగన్ స్వభావమని పేర్కొన్నారు. ప్రజా వేదికను కూల్చి పాలన ప్రారంభించారన్న చంద్రబాబు, పోలీసు వ్యవస్థ ద్వారా అణచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని మాఫియాల రాజ్యంగా తయారు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'ఐదేళ్లలో జగన్ పాలనంతా అరాచకం- చంద్రబాబు మాత్రమే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు' - Actor Prithviraj Fire on CM Jagan
ఇసుక, మైనింగ్, లిక్కర్, ల్యాండ్ మాఫియాలు చేశారు. దుర్మార్గ పాలన తుదముట్టించి ప్రజాస్వామ్యం కాపాడుతామని చంద్రబాబు వెల్లడించారు. డ్రైవింగ్ రాని వ్యక్తి పాలనలో రాష్ట్రం రివర్స్ గేర్‌లో వెళ్లిందని ఎద్దేవా చేశారు. టీచర్లను మద్యం దుకాణాల వద్ద కాపలా పెట్టారని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని రూ.13 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారు, అప్పులు వచ్చే పరిస్థితి లేదు, ఆదాయం తగ్గింది జీతాలు ఇవ్వలేరని మండిపడ్డారు. ప్రజలకు ప్రయోజనకరంగా ఉండే పాలన చేయాలని పేర్కొన్నారు. జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు తీసుకువచ్చారన్న చంద్రబాబు, ప్రజల భూములపై జగన్ పెత్తనం ఏంటని ప్రశ్నించారు. కూటమి వచ్చాక జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం రద్దు చేస్తామని తెలిపారు. ల్యాండ్ గ్రాబింగ్ చట్టం రద్దు దస్త్రంపై రెండో సంతకం చేస్తామన్నారు. ఆస్తులను బలవంతంగా రాసుకున్నారు, సెటిల్‌మెంట్లు చేసుకున్నారని ఆరోపించారు. సైకోను ఇంటికి సాగనంపాలని అందరిలో కసి ఉందిని చంద్రబాబు వెల్లడించారు.