YCP Fake Videos : వైఎస్ జగన్ ను ఇంటికి పంపాలని ప్రజలు నిర్ణయించారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు వెల్లడించారు. అందుకే వైసీపీ తప్పుడు వీడియోలు సృష్టించే ఫేక్ పరిశ్రమను తెరపైకి తెచ్చిందని ధ్వజమెత్తారు. ఈటీవీ విశ్వసనీయత దెబ్బతీసేలా ఆ ఛానల్ పేరుతో ఫేక్ వీడియోలు సృష్టిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రజలు నమ్మే వార్తా ఛానల్ పేరుతో తప్పుడు వీడియోలు ప్రచారం చేస్తే, అంతా నమ్మేస్తారనే దుస్థితికి వైసీపీ దిగజారిపోయిందని దుయ్యబట్టారు.
తప్పుడు ప్రచారాలను ఎండగట్టాలి: పార్టీ ముఖ్యనేతలతో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో వైసీపీ అనుసరిస్తున్న వ్యూహలపై చర్చించారు. అసత్య ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు. అసత్య ప్రచారాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలని పేర్కొన్నారు. ప్రజలు నమ్మే వార్తా ఛానల్ పేరుతో తప్పుడు వీడియోల ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంటెలిజెన్స్ బ్యూరో ను సైతం వదలట్లేదు: వైసీపీ ఫేక్ ప్రచారాలను ( Fake campaign ) ధీటుగా తిప్పికొడుతూ, సూపర్ సిక్స్ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఫేక్ ప్రచారానికి కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో ను సైతం వదలట్లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడిపిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిళ్ల ఇలా ఫేక్ ప్రచారానికి ఏదీ అనర్హం కాదన్నట్లు, వైసీపీ తీరుందని ఆక్షేపించారు.