ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కీలక ప్రాజెక్టులపై పరస్పర సహకారం- చంద్రబాబు మార్గదర్శకత్వం తెలుగు ప్రజలకు ఎంతో అవసరం: రేవంత్ - Chandrababu and Revanth Meeting

Chandrababu Naidu and Revanth Reddy Meeting: కీలక ప్రాజెక్టులపై కలిసి పనిచేయాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో చర్చలు సామరస్యపూర్వకంగా జరిగాయి. సమస్యలపై తరచూ మాట్లాడుకుంటూ వీలైనంత వేగంగా పరిష్కరించుకోవాలని ముఖ్యమంత్రులు నిర్ణయించారు. ముఖ్యమంత్రులిద్దరూ ఇదే సానుకూల దృక్పథం, పరస్పర సహకారంతో ముందుకెళితే రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న అంశాలన్నీ సాధ్యమైనంత త్వరలోనే పరిష్కారమవుతాయని ఉభయ రాష్ట్రాల ప్రజలకూ మేలు జరుగుతుందన్న అభిప్రాయం సమావేశంలో పాల్గొన్న మంత్రులు, అధికారుల్లో వ్యక్తమైంది.

Chandrababu_Naidu_and_Revanth_Reddy_Meeting
Chandrababu_Naidu_and_Revanth_Reddy_Meeting (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 7, 2024, 7:29 AM IST

Chandrababu Naidu and Revanth Reddy Meeting:ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య పెండింగ్‌లో ఉన్న విభజన అంశాలు, ఇతర సమస్యల పరిష్కారంపై శనివారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి మధ్య అత్యంత సుహృద్భావ వాతావరణంలో చర్చలు సాగాయి. గడిచిన పదేళ్లలో ఏ వివాదాలూ లేకుండా రెండు రాష్ట్రాలకు సంబంధించిన అత్యంత కీలకాంశాల పరిష్కారం దిశగా జరిగిన మొదటి సమావేశం ఇదేనని చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే వివిధ జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులను పరస్పర సహకారంతో వేగంగా పూర్తిచేసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.

హైదరాబాద్- అమరావతి మధ్య ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ ప్రెస్‌ హైవే, బుల్లెట్ ట్రైన్, హైదరాబాద్- బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ వే వంటి ప్రాజెక్టులకు భూసేకరణను వేగంగా పూర్తి చేసి వీలైనంత త్వరగా ఆ ప్రాజెక్టులను ఆచరణలోకి తీసుకురావాలన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. తెలంగాణలో విమానాశ్రయాలు, విమాన సర్వీసులకు సంబంధించిన అంశాలపై పరస్పరం సహకరించుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్నాయుడు ఉన్నందున ఆయన సహకారంతో తెలంగాణకు సంబంధించిన పెండింగ్ అంశాల్ని పరిష్కరించుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమైంది.

మూడంచెల విధానంతో విభజన సమస్యలకు పరిష్కారం- నిర్ణయించిన చంద్రబాబు, రేవంత్​ సమావేశం - AP TELANGANA CMS MEETING

రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 42 మంది లోక్‌సభ సభ్యులు, 18 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నందున రెండు రాష్ట్రాల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం వద్దకు కలిసి వెళితే బాగుంటుందని రేవంత్‌రెడ్డి సూచించారు. రెండు రాష్ట్రాల్లోనూ వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్నందున రాజకీయంగా అది సాధ్యం కాదని చంద్రబాబు పేర్కొన్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో కలిసి ప్రయత్నం చేయవచ్చన్నారు. రెండు రాష్ట్రాల అధికారుల కమిటీల మధ్య వీలైనంత తరచుగా సమావేశాలు జరగాలని, అధికారులు పరస్పరం మాట్లాడుకుంటూ అన్ని అంశాల్నీ వేగంగా పరిష్కరించాలని నిర్ణయించారు.

త్వరలో తెలంగాణ నుంచి ఒక కమిటీ ఆంధ్రప్రదేశ్​కు వచ్చి ఇక్కడి అధికారులతో సమావేశమయ్యే అవకాశం ఉంది. సమావేశం అనంతరం చంద్రబాబుగౌరవార్థం రేవంత్‌రెడ్డి విందు ఇచ్చారు. ఆ సందర్భంలోనూ చంద్రబాబు పలు అంశాలను రేవంత్‌రెడ్డి, తెలంగాణ మంత్రులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి తెలంగాణ ఆర్థిక పరిస్థితి, రాష్ట్రానికి వస్తున్న ఆదాయం, తలసరి ఆదాయం ఎలా పెరుగుతూ వచ్చింది వంటి అంశాల్ని ఆయన తరచి తరచి అడిగారు.

కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి ఆరు గ్యారంటీల అమలుపై ఎలా ముందుకెళ్తుందో కూలంకషంగా తెలుసుకున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీల్ని ఏపీలోనూ అమలు చేయనున్నందున తెలంగాణ అనుభవాలు తమకు ఉపయోగపడతాయని చంద్రబాబు పేర్కొన్నారు. చంద్రబాబు దేశంలోని సీనియర్ నాయకుల్లో ఒకరని ఆయన అనుభవం, మార్గదర్శకత్వం తెలుగు ప్రజలకు ఎంతో అవసరమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు స్ఫూర్తితో భూగర్భజలాల పరిరక్షణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు చెప్పారు.

రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా- తెలుగు సీఎంల సమావేశం - CHANDRABABU REVANTH REDDY MEETING

ABOUT THE AUTHOR

...view details