Chandrababu Visit Vijayawada : ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు ఫలించాయి. విజయవాడకు పవర్ బోట్స్ చేరుకున్నాయి. ఈ విషయమై ఆదివారం నాడు కేంద్ర ప్రభుత్వంతో సీఎం మాట్లాడారు. ఈ క్రమంలోనే వివిధ రాష్ట్రాల నుంచి విజయవాడకు బోట్స్ చేరుకున్నాయి. వీటి ద్వారా సింగ్ నగర్ ముంపు ప్రాంతంలో ఆహారం పంపిణీ చేశారు. మరోవైపు ఇళ్లనుంచి బాధితులను బయటకు తెచ్చే పనులు వేగవంతమయ్యాయి.
చంద్రబాబు నిరంతర సమీక్షలు, మానిటరింగ్‌తో అధికార యంత్రాంగం సహాయ చర్యలను ముమ్మరం చేసింది. పునరావాస కేంద్రాలకు వెళ్లే వాళ్లకు దుస్తులు కూడా ఇవ్వాలని ఆయన సూచించారు. మరోవైపు ప్రైవేట్ హోటల్స్, దుర్గగుడి, అక్షయపాత్రల ద్వారా ప్రభుత్వం ఆహారం సమకూర్చింది. నిరంతర పర్యవేక్షణతో అధికారులు ఆహారం సిద్దం చేసి పంపిణీ చేపట్టారు. స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.
మరోసారి పర్యటించిన చంద్రబాబు : ఈ క్రమంలోనే విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు మరోసారి పర్యటించారు. జోరు వర్షంలో బోటు ఎక్కి సింగ్‌నగర్‌కు వెళ్లి బాధితులను పరామర్శించారు. ఉదయమే ఆహారం అందిందా అని వారిని అడిగి తెలుసుకున్నారు. తమకు ఆహారం, తాగునీరు అందాయని వారు ఆయనకు తెలిపారు. తనతో పాటు వచ్చిన మంత్రులను ఇతర ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే సింగ్‌నగర్ నుంచి ఇతర ప్రాంతాలకుమంత్రులు నారాయణ, కొండపల్లి, కొల్లు రవీంద్ర వెళ్లారు.
AP Rains 2024 : వరద బాధితులకు ఆహారం, తాగునీటి పంపిణీ జరుగుతోందని చంద్రబాబు అన్నారు. సహాయచర్యలను మరింత ముమ్మరం చేస్తున్నామని చెప్పారు. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరికీ సాయం అందుతుందని పేర్కొన్నారు. 6 హెలికాప్టర్లు వస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా బోట్ల సంఖ్య కూడా పెంచుతున్నామని పేర్కొన్నారు. వర్షం పడుతున్నా వరద బాధితులకు సాయం ఆపట్లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.