Chandrababu held Teleconference with MPs Ministers MLAs and Activists : పార్టీ కోసం కష్టపడిన వారికి నామినేటడ్ పదవులు త్వరలోనే భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కింద స్థాయి నుంచి ఎవరు ఎక్కడ ఏం పని చేశారో అధ్యయనం చేసి వారికి తగిన పదవులు ఇస్తామని వెల్లడించారు. నాయకులు, కార్యకర్తలు సాధికారత సాధిస్తే పార్టీ పునాదులు కూడా బలంగా ఉంటాయని తెలిపారు. తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, ఎంపీలు, మంత్రులు ఎమ్మెల్యేలు, బూత్ స్థాయి కార్యకర్తలు, నేతలతో సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 2014-2019 మధ్య ఎక్కడెక్కడ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామో వాటన్నింటినీ వంద రోజుల్లోనే ఏర్పాటు చేస్తామని తెలిపారు. గత 20 ఏళ్లలో గెలవని సీట్లు ఇప్పుడు వచ్చాయంటే అది గాలివాటం కాదు, ప్రజలు నమ్మకంతో ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు అని చంద్రబాబు పేర్కొన్నారు.
కూటమి విజయాన్ని కార్యకర్తలకు అంకితం చేస్తున్నా : కూటమి 93 శాతం స్ట్రైట్ రేట్‌తో 57 శాతం ఓట్ షేర్ ను సాధించిందని చంద్రబాబు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయాన్ని కార్యకర్తలకు అంకితం చేస్తున్నాని వెల్లడించారు. ఎన్నికల వేళ మూడు పార్టీల కార్యకర్తలు అద్భుతమైన సమన్వయంతో పనిచేశారని వివరించారు. ఎన్నికల్లో ఘన విజయానికి కారణమైన కార్యకర్తలను మర్చిపోకుండా ప్రతి ఒక్కరి రుణం తీర్చుకుంటా అని తెలిపారు. గత ఐదేళ్లుగా కార్యకర్తలు పడ్డ కష్టాలు తనకు ఎప్పుడూ గుర్తుంటాయని తెలిపారు. వేధింపులు, అక్రమ కేసులు, హత్యలు, అరెస్టులు చూసి నిద్రలేని రాత్రులు గడిపానని చంద్రబాబు వెల్లడించారు.