Chandrababu Clarified on YSRCP Leaders Joining: మరో రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, తెలుగుదేశం ముఖ్య నేతలతో ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఎన్నికల కోసం సిద్ధంగా ఉండాలని నాయకులకు సూచించారు. వైఎస్సార్సీపీపై అసంతృప్తితో ఉన్న నేతలు టీడీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని, నేతలు చంద్రబాబుతో ప్రస్తావించారు. ఈ సందర్భంగా రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై చంద్రబాబు స్పష్టత ఇచ్చారు.
కష్టపడిన నేతలకు నష్టం జరగకుండా:ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు ఎంతోమంది తమను సంప్రదిస్తున్నందున అందరినీ తీసుకోకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పార్టీ ముఖ్య నేతలతో అన్నారు. పొత్తులు, కొత్త చేరికల వల్ల పార్టీలో ఎప్పటి నుంచో కష్టపడిన నేతల రాజకీయ భవిష్యత్‌కు నష్టం జరగకుండా చూడడానికే ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.
Chandrababu on Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికల్లో పోటీ అంశంపైనా చంద్రబాబు వద్ద నాయకులు ప్రస్తావించారు. రాజ్యసభ ఎన్నికల్ల పోటీ చేసే ఆలోచన లేదని ఆయన చెప్పారు. రా కదలిరా, లోకేశ్ శంఖారావం సభలతో పాటు వివిధ రాజకీయ అంశాలపై చర్చించారు. ఎన్నికలకు అటుఇటుగా కేవలం 56 రోజులే ఉందని, పార్టీ నేతలు పూర్తిగా ఎన్నికల మూడ్‌లోకి రావాలని చంద్రబాబు సూచించారు. చంద్రబాబుతో యనమల రామకృష్ణుడు, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, కంభంపాటి రామ్మోహన్ భేటీ అయ్యారు. వైఎస్సార్సీపీ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు తెలుగుదేశంలోకి వస్తారన్న ప్రచారాన్ని చంద్రబాబు వద్ద నేతలు ప్రస్తావించారు.