CEO Mukesh Kumar Meena: ఓటింగ్ ప్రక్రియ ముగిసే సమయానికి క్యూలైన్లో ఉన్న వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఓటర్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రంపచోడవరం, పాడేరు, అరకు నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు, పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో 5 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ముగిసిందని, క్యూలైన్లో ఉన్న వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఇచ్చామన్నారు. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటలలోపు క్యూలైన్ లో ఉన్న వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు.
రీపోల్‌కు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు రాలేదని ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. రేపు ఫిర్యాదులపై ఆర్‌వోలు, పర్యవేక్షకులు సమీక్షిస్తారని వెల్లడించారు. పార్టీల నాయకులతో ఆర్‌వోలు, పర్యవేక్షకులు సమీక్షిస్తారన్నారు. తంగెడలో బాంబు దాడి ఘటనపై మా దృష్టికి వచ్చిందని మీనా పేర్కొన్నారు. తంగెడలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు. పోలింగ్ జాప్యం జరగడానికి అవకాశం లేదన్నారు. సాంకేతిక సమస్య వల్ల పోలింగ్ జాప్యం కావచ్చని సీఈవో వెల్లడించారు.
పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారని, అయితే, ఈవీఎంలకు సంబంధించి కొన్ని సమస్యలు వచ్చాయని మీనా తెలిపారు. 275 బీయూలకు సంబంధించి సమస్యలు వచ్చాయన్నారు. 217 సీయూలకు సంబంధించి సమస్యలు వచ్చినట్లు తమ దృష్టికి వచ్చిందని మీనా స్పష్టం చేశారు. 600 వీవీ ప్యాట్‌లకు సంబంధించి సమస్యలు వచ్చాయని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 20 వేల యంత్రాలు అధికంగా ఉంచినట్లు తెలిపారు. గుర్తింపు కార్డు లేకుండా పోలింగ్ కేంద్రాల వద్దకు తక్కువ మంది ఓటర్లే వచ్చారని పేర్కొన్నారు.