Central University in AnantaPuram : రాష్ట్ర పునర్విభజనలో భాగంగా వెనకబడిన అనంతపురం జిల్లాలో కేంద్రీయ విశ్వవిద్యాలయం తరగతుల నిర్వహణకు సిద్ధమైంది. 2018లో తాత్కాలిక అద్దె భవనాల్లో ఏర్పాటు చేశారు. అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం అనంతపురంలో కేంద్రీయ విశ్వవిద్యాలయానికి ఫేస్-1లో భాగంగా రూ.290 కోట్లు విడుదల చేసింది. ఆ నిధులతో 5 భవనాలు నిర్మించాల్సి ఉండగా 3 భవనాలు పూర్తయ్యాయి. భవనాలతో పాటు రహదారులు, నీటి సదుపాయం, ఇతరత్రా పనులు చేయాలి. అకడమిక్ భవనంతో పాటు, అమ్మాయిలు, అబ్బాయిలకు వేరు వేరుగా 2 వసతి గృహాల నిర్మాణం పూర్తయింది.
జిల్లాలోని బుక్కరాయసముద్రం మండలం జంతులూరు వద్ద కొత్తగా నిర్మించిన సెంట్రల్ యూనివర్శిటీ తరగతుల నిర్వహణకు సిద్ధమైంది. ఈ నెల 12 నుంచి తరగతులు ప్రారంభించనున్నారు. కళాశాల భవనం, వసతి గృహాల్లో శింగనమల ఎమ్మెల్యే శ్రావణి శ్రీ, వీసీ ఎస్ఏ కోరి పూజలు చేశారు. అనంతరం అడ్మినిస్ట్రేటివ్ భవనాలు విద్యార్థుల వసతి భవనాలు పరిశీలించారు. 2014లో సీఎం నారా చంద్రబాబు నాయుడు యూనివర్శిటీకి పునాదులు వేశారని ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో అందుబాటులోకి తెచ్చినట్లు శ్రావణి తెలిపారు.
ప్రభుత్వం కీలక నిర్ణయం - పలు వర్సిటీలకు ఇన్‌ఛార్జ్ వీసీల నియామకం - Govt Appointed University VCs
ప్రధాని, సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవం : ఈ నెల 12వ తేదీ నుంచి క్యాంపస్ నుంచే విద్యార్థులకు తరగతులు వీసీ ఎస్ఏ కోరి నిర్వహిస్తామని, మరో నాలుగు నెలల్లో ఇక్కడి నుంచే పూర్తి స్థాయిలో కార్యకపాలాలు కొనసాగుతాయని అన్నారు. మరో అకడమిక్ భవనం, పరిపాలన భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయని, అవి పూర్తయిన వెంటనే అక్టోబరులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభోత్సవం నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.
రెండో విడతగా 361 కోట్ల రూపాయలు కేంద్రం ఇప్పటికే మంజూరు చేసింది. మొదటి విడత పనులు పూర్తయిన వెంటనే రెండో విడత నిధులు విడుదల కానున్నాయి. ఆ నిధులతో మరో అకడమిక్ భవనం, గ్రంథాలయం, స్పోర్ట్స్ కాంప్లెక్స్, వసతి గృహాలు, అతిథి గృహం, వాణిజ్య సముదాయం, బోధన, బోధనేతర ఉద్యోగులకు నివాస సముదాయం నిర్మించనున్నట్లు ఉపకులపతి తెలిపారు.
యూనివర్శిటీలో 25 రాష్ట్రాల విద్యార్థులు :కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్‌లు, వసతి గృహాల్లోని గదులు, వంట గదులు ఆధునిక సదుపాయాలతో రూపుదిద్దుకున్నాయి. కరవు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో మూడు విశ్వవిశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఎస్కేయూ, జేఎన్‌టీయూతో పాటు కేంద్రీయ విశ్వవిద్యాలయం కూడా ఏర్పాటు చేయడం విశేషం. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పూర్తయ్యాయి. సెంట్రల్ వర్సిటీలో ఈ ఏడాది, గత ఏడాది విద్యార్థులు కలిపి 2024-25 విద్యాసంవత్సరంలో 1500 మంది ఉన్నారు. 17 పీజీ, 8 యూజీ కోర్సులు, 5 విభాగాల్లో పీహెచ్‌డీ కోర్సులు ఈ విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి వచ్చాయి. 25 రాష్ట్రాల నుంచి విద్యార్థులు ఇందులో ప్రవేశాలు పొందడం విశేషం.
2014 -2019 సంవత్సర కాలంలో టీడీపీ ప్రభుత్వంలో సెంట్రల్ యూనివర్సిటీకి భూమిని కేటాయించారు. వైఎస్సార్సీపీ పాలనలో ఒక్క ఇటుకను కూడా పేర్చలేదు. జగన్ మోహన్ రెడ్డికి దిల్లీ వెళ్తే వారి కుటుంబ సభ్యులను కేసుల నుంచి ఎలా తప్పించాలనే ఆలోచన తప్ప రాష్ట్రంలో అభివృద్ధి చేయాడానికి అవసరమైన నిధులను ఏ రోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని అడగలేదు. చంద్రబాబు అధికారం చేపట్టిన రెండు నెలలకే అభివృద్ధి పనులు చకచకా మొదలు పెట్టారు.శ్రావణి శ్రీ, శింగనమల ఎమ్మెల్యే
'దేశాన్ని అలా మార్చడమే నా లక్ష్యం'- నలంద వర్సిటీ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవంలో మోదీ - PM Modi at Nalanda University