Heavy Rains in AP : ఫెయింజల్ తుపాను శనివారం సాయంత్రం తమిళనాడు తీరాన్ని దాటింది. పుదుచ్చేరి సమీపంలోని మహాబలిపురం-కరైకల్ మధ్య తీరం దాటినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. తీరం వెంబడి గరిష్ఠంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తుపాను ప్రభావంతో తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. జిల్లాలోని గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం, సూళ్లూరుపేట, తిరుపతి, శ్రీకాళహస్తి ఆర్‌డీఓ కార్యాలయాల్లో సహాయక కేంద్రాలు, కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ శనివారం మధ్యాహ్నం నుంచి సెలవు ప్రకటించారు.
తుపాన్ ప్రభావం కారణంగా వివిధ ప్రాంతాల నుంచి రేణిగుంటకు పలు విమాన సర్వీసులు రద్దు చేశారు. తడలో వర్షం కురవడంతో చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై వర్షపు నీరు చేరి వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షాల నేపథ్యంలో తిరుమలలో టీటీడీ పలు జాగ్రత్తలు చేపట్టింది. కొండచరియలపై ప్రత్యేక నిఘా, ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎగువన కురిసిన వర్షాలతో ఒకటో కనుమ రహదారిలో ఉన్న మాల్వాడి గుండం జలపాతం భక్తులను అలరిస్తోంది.
విస్తారంగా వర్షాలు : శ్రీకాళహస్తి నియోజకవర్గంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. స్వర్ణముఖి నదిలో వరద ప్రవాహం పెరిగింది. వెంకటగిరి-శ్రీకాళహస్తి ప్రధాన రహదారులు, పలు కాజ్‌వేలపై వరద ప్రవహిస్తుంది. దీంతో అధికారులు వాహనాల రాకపోకలను నియంత్రించారు. ఏర్పేడు మండలం సీతారాంపేటలో పాత భవనం కుప్పకూలింది. ఆ సమయంలో అక్కడెవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
కోనసీమ జిల్లా వ్యాప్తంగా 22 మండలాల్లోనూ వర్షం కురవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. జిల్లాలో సుమారు 60,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కల్లాల్లో ఉంది. ధాన్యం తడిసిపోకుండా రైతులు టార్పాలిన్లు కప్పి జాగ్రత్తలు తీసుకున్నారు. కొన్నిచోట్ల ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. వర్షం ఇలాగే కొనసాగితే మరింత ఇబ్బంది పడతామని అన్నదాతలు ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్రపాలిత ప్రాంతం యానం తుపాను ప్రభావంతో అతలాకుతలం అవుతుంది. పుదుచ్చేరి బీచ్ రోడ్, మత్స్యకారుల గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి ప్రజలు గజగజ వణుకుతున్నారు. ముఖ్యమంత్రి రంగస్వామి పరిస్థితిని ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ కలెక్టర్, ఉన్నతాధికారులకు తగు సూచనలు చేస్తున్నారు.
వాతావరణ మార్పులతో కృష్ణా జిల్లా ధాన్యం రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సంవత్సరం కృష్ణా జిల్లాలో 3.74 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. 61,775 ఎకరాలు కోత కోశారు. 70,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లుకు చేరింది. మరింత ధాన్యం రోడ్ల మీదే ఉంది. కోతకు వచ్చిన వరి నూర్పిడిని యంత్రాలతో వేగవంతం చేశారు. తేమశాతం తగ్గించేందుకు ధాన్యం రాసులు ఆరబెట్టారు. చినుకు పడితే పంట చేతికి వచ్చే అవకాశం ఉండదని అన్నదాతలు భయపడుతున్నారు. మోపిదేవి, చల్లపల్లి మండలాల్లో మిషన్‌తో వరి కోతలు కోసుకుని అరబెట్టుకున్న ధాన్యాన్ని టీడీపీ కార్య నిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాస్ పరిశీలించారు.
AP Heavy Rains : తుపాను బలహీనపడ్డా రాష్ట్రంలో రాబోయే రెండు రోజులూ భారీ వర్షాలుంటాయని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఆది, సోమవారాల్లో వైఎస్సార్, శ్రీసత్యసాయి, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. చిత్తూరు, వైఎస్సార్, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదముందని హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం వరకూ మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించింది.
కృష్ణపట్నం పోర్టుకు ఆరో నంబర్, మిగతా పోర్టులకు మూడో నంబర్ హెచ్చరికలు జారీచేశారు. మరోవైపు ప్రకాశం జిల్లా కొత్తపట్నం సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. సముద్రం 20 మీటర్ల పైగా ముందుకొచ్చింది. తుపాను కారణంగా ఉద్యానవన, వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు. రాయలసీమ జిల్లాల్లో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉండడంతో తుపాను తీవ్రత తగ్గిన వెంటనే చేపట్టాల్సిన సంరక్షణ చర్యలను రైతులకు తెలియచేసేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. అధికారులు ఎవరూ సెలవు పెట్టకుండా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
రైతులను వణికిస్తున్న ఫెయింజల్ - తీర ప్రాంతాలకు రెడ్ అలెర్ట్