తెలంగాణ

telangana

'ఫోన్​ ట్యాపింగ్​కు మా పర్మిషన్ అక్కర్లేదు' - హైకోర్టుకు కేంద్రం నివేదిక - CENTRAL GOVT ON PHONE TAPPING CASE

By ETV Bharat Telangana Team

Published : Aug 21, 2024, 7:36 AM IST

Updated : Aug 21, 2024, 8:24 AM IST

Phone Tapping Case in Telangana : ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్నవాళ్లు గత అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించి నిబంధనలకు విరుద్ధంగా అక్రమాలు పాల్పడ్డారని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. మరోవైపు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఫోన్ ట్యాపింగ్‌ చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక అధికారం ఉందని కోర్టుకు కేంద్ర హోంశాఖ తెలిపింది. ప్రభుత్వాలు చేపట్టే ఫోన్ ట్యాపింగ్‌కు తమ అనుమతి అవసరంలేదని వివరిస్తూ కౌంటర్ దాఖలు చేసింది.

Phone Tapping Case in Telangana
Phone Tapping Case in Telangana (ETV Bharat)

Telangana Phone Tapping Case Updates : గత ప్రభుత్వం చేపట్టిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పోలీసులు దాఖలు చేసిన కౌంటర్‌లో ఎక్కడా కేంద్రం ప్రస్తావన లేదంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ హైకోర్టుకు తెలిపింది. అంతేగాకుండా ఈ ఫోన్ ట్యాపింగ్​కు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం ఇచ్చినట్లు కూడా పేర్కొనలేదని పేర్కొంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఫోన్ ట్యాపింగ్‌ చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక అధికారం ఉందని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే ఫోన్ ట్యాపింగ్‌కు తమ అనుమతి అవసరంలేదని వివరించింది. రాజకీయ ప్రత్యర్థులు, ప్రైవేటు వ్యక్తులతోపాటు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్​ చేస్తున్నట్లు పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా తీసుకున్న సుమోటో పిటిషన్​పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఆలోక్​ అరాదే, జస్టిస్​ టి.వినోద్​ కుమార్​లతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది.

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక అధికారాలు : కేంద్రం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహశర్మ కౌంటరు దాఖలు చేసినట్లు తెలిపారు. టెలికమ్యూనికేషన్ చట్టం ప్రకారం ఎవరైనా అనధికారికంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తే మూడేళ్ల జైలు, రూ.2 కోట్ల వరకు జరిమానా విధించచవచ్చని కౌంటర్‌లో కేంద్రం తెలిపింది. ఏ పరిస్థితుల్లో ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చో టెలిగ్రాఫిక్ నిబంధనల్లో స్పష్టంగా ఉందని, దాని ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హోంశాఖ కార్యదర్శులు ఆదేశాలు జారీ చేయవచ్చింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక అధికారాలుంటాయని అదేవిధంగా రెండింటికీ వేర్వేరుగా రివ్యూ కమిటీలు ఉంటాయని తెలిపింది. అయితే ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చిందన్నదానిపై కారణాలు నమోదు చేయాల్సి ఉందని చెప్పింది. ఈ ఉత్తర్వులను సమీక్షించడానికి రివ్యూ కమిటీ ఉంటుందని, ఈ కమిటీ వాటిని ధ్రువీకరించాల్సి ఉందన్నారు. ఈ ఉత్తర్వులు 60 రోజుల వరకు అమల్లో ఉంటాయని, మళ్లీ పొడిగించుకోవచ్చని గరిష్ఠంగా 180 రోజుల వరకు ఉంటాయంది. రికార్డులను కూడా 6 నెలల్లో ధ్వంసం చేయవచ్చని తెలిపింది. కేంద్ర టెలికమ్యూనికేషన్ చట్టం-23 జూన్ 21 నుంచి అమల్లోకి వచ్చిందని వివరించింది.

అయితే ఇంకా నిబంధనలు రూపొందించలేదని అప్పటివరకు ప్రస్తుతం అమల్లో ఉన్న టెలిగ్రాఫ్‌ నిబంధనలే వర్తిస్తాయని స్పష్టంచేసింది. కొత్త చట్టం ప్రకారం, అనుమతి లేకుండా చట్టవిరుద్ధంగా ట్యాపింగ్​కు పాల్పడితే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదంటే రూ 2 కోట్లు జరిమానా లేదా రెండూ కలిపి విధించవచ్చని పేర్కొంది. ప్రస్తుత కేసుకు సంబంధించి తమ ప్రస్తావన లేదని ఎలాంటి సమాచారం ఇవ్వలేదని కేంద్రం పిటిషన్​లో వివరణ ఇచ్చింది.

రాష్ట్ర ప్రభుత్వం నివేదిక : గత అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడానికిగాను ప్రణీత్‌రావుతో సహా నిందితులు చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. నిందితులంతా వ్యక్తిగత అజెండాలతో అధికార పార్టీకి సహకరించడానికి చట్టనిబంధనలను వినియోగించుకుని అక్రమాలకు పాల్పడ్డారని తెలిపింది .అంతేగాకుండా అనుమతి లేకుండా పరికరాలను రికార్డులను ధ్వంసం చేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన కేసులో హోంశాఖ తరఫున ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా హైకోర్టులో కౌంటరు దాఖలు చేశారు.

డి. రమేశ్ ఫిర్యాదు ప్రకారం ప్రణీత్‌రావు ఎస్ఐబీలో రెండు గదులను ఆయన సొంతం చేసుకుని అక్కడ 17 కంప్యూటర్లు ఇంటర్నెట్ ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేసుకున్నారని పేర్కొన్నారు. కొంత మంది వ్యక్తుల ప్రొఫైల్స్ సిద్ధం చేసి రహస్యంగా, అనధికారికంగా చట్టవిరుద్ధంగా వాటిని పర్యవేక్షిస్తూ వచ్చారన్నారు. కొన్ని భౌతిక, ఎలక్ట్రానిక్ రికార్డులు ఎస్ఐబీ ఆఫీసు నుంచి కనిపించకపోవడాన్ని గమనించిన రమేష్ విచారణ చేపట్టగా ప్రణీత్‌కుమార్ అధికార దుర్వినియోగానికి పాల్పడి ఇతరులతో కుమ్మక్కై వ్యక్తిగత పరికరాల్లో సమాచారాన్ని కాఫీ చేసుకున్నట్లు తేలిందని చెప్పారు. కుట్రపూరిత చర్యలను తొక్కిపెట్టడానికిగాను సమాచారాన్ని తొలగించి సిస్టంలను ధ్వంసం చేశారన్నారు.

Telangana Phone Tapping : ప్రస్తుతం అభియోగ పత్రం దాఖలైందని, కోర్టు అనుమతితో దర్యాప్తు కొనసాగుతోందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. విదేశాల్లోని నిందితులను రప్పించడానికి రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసినట్లు తెలిపారు. ఫోన్‌ట్యాపింగ్​కు సంబంధించి చట్ట ప్రకారం అధీకృత అధికారిగా వాస్తవాలను కోర్టు దృష్టికి తీసుకువస్తున్నట్లు వివరించారు. సాధారణంగా ఇంటిలిజెన్స్ చీఫ్, పోలీసు శాఖాధిపతి ఈ ప్రక్రియను చేపడతారన్నారు. హోంశాఖ నోటిఫికేషన్ ద్వారా అదనపు డీజీ, ఇంటిలిజెన్స్ ఐజీ, స్పెషల్ ఇంటిలిబజెన్స్ బ్రాంచ్ ఐజీ, కౌంటర్ ఇంటిలిజెన్స్​లకు అధికారాన్ని అప్పగించిందని తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ ట్యాపింగ్ చేపట్టవచ్చని, అయితే మూడు రోజుల్లో హోంశాఖ కార్యదర్శికి తెలియజేయాల్సి ఉందన్నారు.

దీన్ని ఏడు రోజుల్లో ధ్రువీకరించాలని లేదంటే అవి రద్దయిపోతాయని హైకోర్టుకు తెలిపారు. అంతేగాకుండా ఫోన్ ట్యాపింగ్​ను రివ్యూ కమిటీ కూడా ధ్రువీకరించాల్సి ఉందని అన్నారు. 2013లో జారీ చేసిన జీవో 86 ప్రకారం ఇంటిలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్, ఐజీ ప్రభాకర్‌రావు, ఐజీపీ రాజేష్ కుమార్‌లకు ప్రభుత్వం ఆధీకృత అధికారులుగా అనుమతి మంజూరు చేసిందని చెప్పారు. 2020 జూన్‌లో ప్రభాకర్‌రావు పదవీ విరమణ చేయగా ప్రభుత్వం రెండుసార్లు సర్వీసును పొడిగించిందని తెలిపారు.

మోసపూరిత అనుమతులు పొంది ట్యాపింగ్ : వామపక్ష తీవ్రవాదం, తదితరాల ముసుగులో మోసపూరితంగా అనుమతులు పొంది ట్యాపింగ్‌లకు పాల్పడినట్లు హైకోర్టుకు నివేదిక ఇచ్చారు. ఎస్ఐబీ తీవ్రవాదానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించాల్సి ఉందన్నారు. కేంద్ర హోంశాఖలతో పాటు ఇతర సంస్థల్లో కూడా తీవ్రవాద సమాచారం నిమిత్తం ట్యాపింగ్ చేయడానికి తెలంగాణ ఎస్ఐబీ కీలక సంస్థ అని పేర్కొన్నారు.

ఫోన్ ట్యాపింగ్​పై సమగ్రంగా కౌంటర్​ దాఖలు చేస్తాం - హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక - Telangana HC on Phone Tapping

ఫోన్​ ట్యాపింగ్​ విషయంలో మీడియా సంయమనం పాటించండి - వారి పేర్లు బహిర్గతం చేయొద్దు : హైకోర్టు - telangana hc on phone tapping

Last Updated : Aug 21, 2024, 8:24 AM IST

ABOUT THE AUTHOR

...view details