Polavaram Project Funds: పోలవరానికి నిధులు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ తీర్మానంతో ప్రాజెక్టు నిర్మాణాన్ని పరుగులు పెట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతోంది. 41.15 మీటర్ల ఎత్తున ప్రాజెక్టు తొలిదశను 2027 మార్చినాటికే పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. కేంద్రం నిధులు కేటాయించటం నిరాశ, నిస్పృహలో ఉన్న రాష్ట్రానికి ఇదొక భరోసాగా ఉంటుందని సీఎం తెలిపారు. పోలవరం ఫేజ్-1 కు 30వేల 437 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు వివరించారు.
పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడానికి ముందు రాష్ట్రం తరపున 4 వేల 730 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. దాన్ని రాష్ట్ర వాటాగా పరిగణించి మిగిలిన నిధులు కేంద్రం ఇచ్చేలా నిర్ణయించామని అన్నారు. కేంద్రం నుంచి 25 వేల 706 కోట్లు రావాల్సి ఉంటే, ఇప్పటికే 15 వేల 146 కోట్లు విడుదల చేశారని సీఎం వెల్లడించారు. భూ సేకరణ, మిగిలిన 12 వేల 127 కోట్లు ఇవ్వడానికి కేంద్రం ఆమోదం తెలిపిందని స్పష్టం చేశారు.
పోలవరం టార్గెట్ ఫిక్స్- 2027 మార్చిలోగా పూర్తి చేసేలా షెడ్యూల్ :చంద్రబాబు - Polavaram Project Construction
వాస్తవానికి 2014-19 టీడీపీ హయాంలోని ఐదేళ్లలో రూ.11,762 కోట్లు ఖర్చు చేశారు. ఒకే రోజున 32,215 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసి గిన్నిస్ కూడా సాధించారు. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణంలో కీలకమైన డయాఫ్రం వాల్ ను 414 రోజుల్లో పూర్తి చేశారు. నిర్వాసితుల కోసం 4,114 కోట్లు మేర చెల్లింపులు చేశారు. అయితే 2019లో అధికార మార్పిడి తర్వాత మొత్తం సీన్ రివర్సు అయ్యింది. ప్రాజెక్టు 2019లో ఎక్కడైతే ఆగిపోయిందో ఇప్పుడు అక్కడి నుంచే మొదలు పెట్టాల్సిన దుస్థితి.
ఐదేళ్లలో కేవలం 1.75 శాతం మేర పనుల్ని మాత్రమే వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేయగలిగింది. ప్రాజెక్టును గాలికొదిలేయటంతో కాఫర్ డ్యాం, డయాఫ్రాం వాల్ నిర్మాణాలు దెబ్బతిన్నాయి. రివర్సు టెండరింగ్ ద్వారా కాంట్రాక్టర్‌ను మార్చవద్దంటూ కేంద్రం చెప్పినా, గత ప్రభుత్వం చెవికెక్కించుకోలేదు. ఫలితం ప్రాజెక్టు నిర్మాణం మరింత ఆలస్యం అయింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో మళ్లీ ప్రాజెక్టు నిర్మాణంపై ఆశలు పెరిగాయి. 2027 నాటికి 41.15 మీటర్ల మొదటి దశ పనులు పూర్తి చేసి డెల్టా రైతులకు నీరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. కేంద్రం 12 వేల కోట్లు ఇచ్చేందుకు అంగీకారం తెలియచేయటంతో ప్రాజెక్టు వడివడిగా పరుగెడుతుందన్న ఆశాభావం వ్యక్తం అవుతోంది. పోలవరం ప్రాజెక్టు వల్ల 23 లక్షల ఎకరాల ఆకయకట్టు స్ధీరీకరణ, 28 లక్షల మంది జనాభాకు తాగు నీరు లభించనుంది. పారిశ్రామిక అవసరాలతో పాటు 960 మెగావాట్ల జలవిద్యుదుత్పత్తికి పోలవరం ప్రాజెక్టు వరంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.
పోలవరంపై కేంద్రం ఫోకస్ - ప్రాజెక్టుకు అవసరమైన నిధులకు కేబినెట్ ఆమోదం! - Central Funds for Polavaram