AP MLC Notification 2025 : రాష్ట్రంలో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 3న లెక్కింపు జరగనుంది. ఫిబ్రవరి 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరుగుతుంది. నామినేషన్ల దాఖలుకు ఫిబ్రవరి 10 వరకు గడువు ఉంటుంది. అలాగే ఫిబ్రవరి 11న నామినేషన్ల పరిశీలన చేస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 13 వరకు గడువు పెట్టారు.
రెండు పట్టభద్రుల, ఒక ఉపాధ్యాయ స్థానానికి ఎన్నికలు జరగనుంది. ఉభయగోదావరి పట్టభద్రుల నియోజకవర్గం. అలాగే కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నిక జరగనుంది. అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నిక నిర్వహించనున్నారు. ఎన్నికలు జరిగే జిల్లాల్లో తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు కానుంది.
ఎమ్మెల్సీ ఎన్నిక వ్యూహాంలో టీడీపీ నేతలు : కీలకమైన బిల్లులు ఆమోదించడానికి అసెంబ్లీతో పాటు కౌన్సిల్లో కూడా మెజార్టీ అవసరం ఉందని, అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా కీలకమని ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ చిరంజీవి రావు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించడానికి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల దగ్గరికి వెళ్లి ఓట్లు అడుగుతున్న మొదటి ఎన్నిక ఎమ్మెల్సీవే అన్నారు. ఈ ఎన్నికల్లో విజయం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు మొదటి మెట్టు అని చిరంజీవి పేర్కొన్నారు.