New Railway Line at Amaravati :రాజధానిని అనుసంధానిస్తూ మంజూరైన కొత్త రైల్వే లైన్ ఏపీ కలల రాజధాని అమరావతి సిగలో మరో మణిహారం కానుంది. అమరావతిలో కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు కేంద్రం పచ్చజెండా ఊపటాన్ని రాజధాని ప్రాంత ప్రజలు స్వాగతిస్తున్నారు. అమరావతి నిర్మాణ పనులు తిరిగి ప్రారంభమైన వేళ అతి ముఖ్యమైన రైల్వే ప్రాజెక్టు విషయంలో కేంద్రం తీపికబురు చెప్పిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అమరావతికి రైల్వే లైన్ మంజూరు చేస్తూ కేంద్రం చేసిన ప్రకటనపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే విజయవాడ, గుంటూరు జంక్షన్లు ఉన్నప్పటికీ వాటికి రాజధానితో అనుసంధానం లేదు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు ద్వారా గుంటూరు, విజయవాడ లైన్లపై ఒత్తిడి తగ్గుతుంది. ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు 57 కిలోమీటర్ల మేర నిర్మించబోయే కొత్త లైన్‌లో పెద్దాపురం, చెన్నారావుపాలెం, గొట్టుముక్కల, పరిటాల, కొత్తపేట, వడ్లమాను, అమరావతి, తాడికొండ, కొప్పురావూరు స్టేషన్లు ఉంటాయి. సింగిల్ లైన్ నిర్మాణంలో భాగంగా కృష్ణానదిపై 3.2 కిలోమీటర్ల వంతెన నిర్మిస్తారు. పరిటాల వద్ద టెర్మినల్ ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి సరకు రవాణాకు సదుపాయాలు కల్పిస్తారు. రాష్ట్రంలోని కృష్ణపట్నం, కాకినాడతో పాటు త్వరలో రానున్న మచిలీపట్నం నౌకాశ్రయాలతో అనుసంధానిస్తారు.
మహానగరికి మహార్దశ - రూ. 2,245 కోట్లతో 57 కి.మీ. రైల్వే లైన్ నిర్మాణం
కొత్త రైల్వే లైనుకు ఖమ్మం, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల పరిధిలోని దాదాపు 450 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమరావతి రైల్వే లైన్‌కు మోకాలడ్డకుండా ఉంటే ఈ పాటికే పనులు చాలా వరకూ జరిగేవి. రైల్వే లైన్ అవసరం లేదని జగన్ సర్కారు లేఖ రాయటంతో అప్పట్లో కేంద్రం ఈ లైన్‌ను పక్కన పెట్టింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి రైల్వే లైన్‌ను మళ్లీ పట్టాలెక్కించారు. పాత డీపీఆర్‌లో మార్పులు చేసి ఆమోదించారు. రూ. 2,245 కోట్లతో కొత్త లైన్‌ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ పరిణామాన్ని రాజధాని ప్రాంత ప్రజలు స్వాగతిస్తున్నారు.