APSRTC Special Buses for Sankranthi Festival: సంక్రాంతి పండుగకు ఊరెళ్తున్నారా? అయితే ఆర్టీసీ అధికారులు నుంచి మీకో శుభవార్త. సాధారణంగా డొక్కు బస్సులు, ఛార్జీల పెంపు, సంక్రాంతి వచ్చిందంటే ఆర్టీసీ బస్సుల గురించి ప్రయాణికులు చెప్పే మాటలివి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితి మారింది. పండక్కి సొంత ఊర్లు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఛార్జీల పెంపు లేదని, మంచి కండిషన్‌లో ఉన్న బస్సులే నడుపుతామని చెబుతున్నారు.
వైఎస్సార్సీపీ పాలనలో సంక్రాంతి స్పెషల్ బస్సులతో ప్రజలు పడిన ఇబ్బందులు ఈసారి లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వం ఆదేశించింది. చలి తీవ్రత అధికంగా ఉన్నందున బస్సుల కిటికీ అద్దాలు సరిగా లేని వాటిని గుర్తించి ముందే మరమ్మతులు చేయాలని స్పష్టం చేసింది. ప్రత్యేక బస్సులకు అదనంగా ఛార్జీలు వసూలు చేయవద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రానూ, పోను ఒకేసారి టికెట్ రిజర్వు చేసుకునే వారికి 10శాతం రాయితీ ప్రకటించింది. కడప జోన్లోని 4 జిల్లాల పరిధిలో ఈసారి సంక్రాంతికి 2327 బస్సులను నడపాలని నిర్ణయించారు. సంక్రాంతికి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని అధికారులు ప్రణాళిక చేశారు.
సంక్రాతి ఎఫెక్ట్ : ఆర్టీసీ బస్సుల్లో దొరకని సీట్లు! - దోచేస్తున్న ప్రైవేటు ట్రావెల్స్
'ఉమ్మడి అనంతపురం జిల్లాల నుంచి సంక్రాంతికి సొంత ఊర్లకు వెళ్లేవారికోసం ప్రత్యేక బస్సులు సిద్ధమవుతున్నాయి. ప్రత్యేక బస్సులకు అవసరమైన మరమ్మతులు చేస్తున్నారు. ఈనెల 9 నుంచి 12వ తేదీ వరకు అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని జిల్లా కేంద్రాల నుంచి ప్రత్యేక బస్సులు అనేక నగరాలకు నడుపుతున్నారు. 14 నుంచి 19వరకు ప్రయాణికులు సొంత ఊర్ల నుంచి తిరిగి వచ్చే ఏర్పాట్లు చేశారు'. అని అనంతపురం ఆర్టీసీ డీఎం నాగభూపాల్, అనంతపురం ఆర్ఎం సుమంత్ తెలిపారు.
మరోవైపు జిల్లా ఆర్టీసీ ఆధికారులతో కడప రీజనల్ ఛైర్మన్ పూల నాగరాజు సమావేశమయ్యారు. ప్రయాణికుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు.
ప్రయాణికులకు గుడ్న్యూస్ - సంక్రాంతికి 6,432 ప్రత్యేక బస్సులు