Cell Phone Theft Cases In Hyderabad :హైదరాబాద్‌లో తెల్లవారుజామున నిర్మానుష్య ప్రాంతాల్లో వాకింగ్‌కు వెళ్తున్నారా? అయితే జాగ్రత్త!, ఇటీవల సెల్‌ఫోన్ దొంగలు తెల్లవారుజామునే విజృంభిస్తున్నారు. ఒంటరిగా కనిపిస్తే వచ్చి బెదిరించి మరీ దోచుకెళ్తున్నారు. అడ్డుకుంటే కత్తితో దాడి చేసేందుకు ఏ మాత్రం వెనకాడటం లేదు. ఇలాంటి ఘటనే నిన్న తెల్లవారుజామున అబిడ్స్, ఐమాక్స్ ఏరియాల్లో జరిగాయి. రెండు ఘటనల్లో నిందితులు ఒక్కరే.
ఇదీ జరిగింది :మంగళవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఐమాక్స్ వద్ద న్యాయవాది కల్యాణ్ వాకింగ్‌కు వెళ్లారు. అతని వద్దకు ఇద్దరు వ్యక్తులు యాక్టివాపై వచ్చారు. హిందీలో మాట్లాడుతూ ఆయన దగ్గరున్న శాంసంగ్ మొబైల్ గుంజుకునేందుకు యత్నించారు. లాయర్ కల్యాణ్ అడ్డుకోవడంతో కత్తితో బెదిరించారు. అయినా విడిచిపెట్టకపోవడంతో దాడి చేసి ఫోన్‌తో పారిపోయారు. ఈ దాడిలో కల్యాణ్‌కు గాయాలయ్యాయి. వెంటనే బాధితుడు పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారమిచ్చారు.
సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు :ఈ ఘటన జరగడానికి గంట ముందు అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇదే తరహ చోరీ జరిగింది. గన్ ఫౌండ్రీలోని ప్రసాద్ అపార్ట్ మెంట్ వద్ద వాచ్ మెన్ వద్దకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు కత్తితో బెదిరించి మొబైల్ ఫోన్‌ను ఎత్తుకెళ్లారు. అక్కడి నుంచి వారు ఐమాక్స్ వద్దకు వెళ్లారు. ఒకేరోజు ఒకే ఏరియాలో రెండు సెల్‌ఫోన్ చోరీలు జరగడంతో సెంట్రల్‌జోన్ డీసీపీ అక్షాన్ష్ యాదవ్ అప్రమత్తమయ్యారు. ప్రత్యేక టీమ్‌లతో దర్యాప్తునకు ఆదేశించారు.
చోరీ జరిగిన ఏరియాలో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్‌ను పోలీసులు చెక్ చేశారు. వాటి ఆధారంగా రాంనగర్ ఫిష్ మార్కెట్ వద్ద ఒకరిని అదుపులోకి తీసుకొని విచారించగా వాచ్ మెన్ వద్ద దొంగిలించిన రెడ్ మీ మొబైల్ ఫోన్ లభించింది. అతనిచ్చిన సమాచారంతో చాంద్రాయణ గుట్ట బండ్లగూడ వద్ద మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గరి నుంచి న్యాయవాది కల్యాణ్ నుంచి దొంగిలించిన శాంసంగ్ మొబైల్ ఫోన్‌ను రికవరీ చేశారు. నిందితుల నుంచి దాడికి ఉపయోగించిన కత్తితో పాటు హోండా యాక్టివాను స్వాధీనం చేసుకున్నారు.