Telangana Second Rank in Cell Phones Recovery : సీఈఐఆర్ పోర్టల్(CEIR Portal) ఆధారంగా సెల్ఫోన్ల రికవరీలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. 2023 ఏప్రిల్ 19 నాటి నుంచి నేటి వరకు(మే 21వరకు) 30,049 ఫోన్లు రికవరీ చేసినట్లు అదనపు డీజీ మహేశ్ భగవత్ తెలిపారు. సంవత్సర కాలం ముగిసే నాటికి 26,833 ఫోన్లు రికవరీ చేశామని చెప్పారు. తెలంగాణలోని హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 4,869, సైబరాబాద్ పరిధిలో 3,078, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 3,042 ఫోన్లు రికవరీ చేశామన్నారు.
కాగా 35,945 ఫోన్లు రికవరీతో కర్ణాటక తొలిస్థానంలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 7,387 ఫోన్ల రికవరీలతో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో ఉందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 780 పోలీస్ స్టేషన్లలలో సీఈఐఆర్ యూనిట్లు ఉన్నాయని ఆయన తెలిపారు. గడిచిన తొమ్మిది రోజుల్లో 1000 ఫోన్లు రికవరీ చేశామని అదనపు డీజీ మహేశ్ భగవత్ స్పష్టం చేశారు.
చోరీ చేసిన వ్యక్తి సిమ్ వేసిన వెంటనే మెసేజ్ వస్తుంది : రాష్ట్ర సీఐడీ విభాగం కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రార్(CEIR)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సీఈఐఆర్తో చోరీకి గురైన మొబైల్ ఫోన్ను క్షణాల్లో ట్రాక్ చేయడమే కాకుండా అందులో వేరే సిమ్ కార్డు వేసినట్లు ప్రయత్నిస్తే ఇట్టే వివరాలు తెలుసుకోవచ్చు. ఈ విధానం దిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో మాత్రమే అమల్లో ఉండేది. ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఈ వ్యవస్థను తీసుకువచ్చారు. దీంతో మొబైల్ దొంగలను పట్టుకునేందుకు పోలీసులకు ఎక్కువ సమయం వృథా కావడం లేదు.