AP Intelligence DG:రాష్ట్ర నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్‌ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్‌గా పీహెచ్‌డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. వీరు తక్షణమే బాధ్యతల్లో చేరాలని ఆదేశించింది. విధుల్లో చేరినట్లుగా కంప్లెయిన్స్ రిపోర్టును ఇవాళ ఉదయం 11 గంటల్లోగా పంపించాలని కోరింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్. జవహర్‌రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ బుధవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. వైకాపాతో అంటకాగుతూ అయిదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ము కాస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేసిన ఫిర్యాదుల ఆధారంగా నిఘా విభాగాధిపతి పీఎస్‌ఆర్ ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. వారి స్థానాల్లో కుమార్ విశ్వజిత్, పీహెచ్‌డీ రామకృష్ణను ఎన్నికల సంఘం నియమించింది.
కుమార్ విశ్వజిత్ 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం రైల్వే విభాగం అదనపు డీజీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎక్కడా విమర్శలకు ఆస్కారమివ్వకుండా నిబంధనల ప్రకారం పనిచేస్తారనే పేరుంది. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ ఈసీ ఈయన్నే నిఘా విభాగాధిపతిగా నియమించింది. ఆ తర్వాత వైకాపా అధికారంలోకి వచ్చాక కూడా నాలుగైదు నెలల పాటు అదే పోస్టులో కొనసాగారు. ఆ తర్వాత ఆయనను ఆ పోస్టు నుంచి తప్పించారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం డీజీగా, ఏసీబీ డీజీగా పని చేశారు. ఒత్తిళ్లకు తలొగ్గరనే పేరుంది. ఆయన నిఘా విభాగాధిపతిగా విధులు చేపట్టడం ఇది రెండోసారి.
ఇంటెలిజెన్స్ డీజీ, విజయవాడ సీపీపై బదిలీ వేటు - EC transfers Intelligence DG and SP