CC Cameras in RTC Buses Vemulawada :కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో, సంస్థ లాభాల బాట పట్టిందని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ(Vemulawada Temple) ఆర్టీసీ బస్టాండ్‌లో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భరోసా ఫేజ్-2లో భాగంగా బస్సుల్లో ఏర్పాటు చేసిన నిఘా కెమెరాలను ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మట్లాడుతూ మహాలక్ష్మి పథకంతో(Mahalakshmi Scheme) బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆది శ్రీనివాస్(MLA Aadi Srinivas) పేర్కొన్నారు. ఆర్టీసీ లాభాల బాటలో నడుస్తోందని, బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయన్నారు. బస్సుల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో మహిళల భద్రతకు ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. ఈవ్ టీజింగ్, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే ఆకతాయిలకు నిఘా కెమెరాలతో అడ్డుకట్ట పడుతుందని తెలిపారు.
Vemulawada Temple : బస్సులో మహిళా పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. నిఘా కెమెరాలు ఏర్పాటుతో మహిళలకు బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు తమ ఇంట్లో ఉన్నట్టు భావన ఏర్పడుతుందని తెలిపారు. ఆర్టీసీ డిపోలో ఉన్న బస్సులు సరిపోవడం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లడంతో, డిపోకు తొమ్మిది బస్సులు కేటాయించడంతోపాటు త్వరలో కొనుగోలు చేసే 500 బస్సులో మరిన్ని బస్సులు కేటాయిస్తామని చెప్పినట్లు వెల్లడించారు. వేములవాడ పుణ్యక్షేత్రం నుంచి భద్రాచలం, యాదగిరిగుట్టకు బస్సులు నడిపించడానికి చర్యలు తీసుకున్నట్లు ఆది శ్రీనివాస్ చెప్పారు.