CAT Rejected Suspension of Senior IPS AB Venkateswara Rao:జగన్ ప్రభుత్వ అహంకారం, నిరంకుశత్వంపై క్యాట్ సమ్మెటపోటు వేసింది. ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై విధించిన సస్పెన్షన్ చెల్లదంటూ తీర్పు వెలువరించింది. ఆయనపై కక్ష సాధింపే లక్ష్యంగా ఏళ్ల తరబడి పోస్టింగ్, వేతనాలు ఇవ్వకుండా, అక్రమ కేసులు, తప్పుడు అభియోగాలు పెట్టి వేధించినా ఎక్కడా తగ్గకుండా ఒంటరిగానే తొలి నుంచి తుది వరకూ ధైర్యంగా పోరాడినందుకు ఆలస్యంగానైనా సరే న్యాయం చేకూరింది. తాను ఏ తప్పూ చేయలేదంటూ మొదటి నుంచి వాదన వినిపిస్తున్న ఆయన చివరికి నైతికంగా గొప్ప విజయం దక్కించుకున్నారు.
దురుద్దేశపూరితంగా తనకు ఆపాదించిన అభియోగాలన్నింటినీ పటాపంచలు చేశారు. ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ చెల్లదంటూ హైదరాబాద్‌లోని క్యాట్ బుధవారం తీర్పు ఇచ్చింది. ఆయన్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. తనను రెండోసారి సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ గతేడాది ఏప్రిల్‌లో ఆయన హైదరాబాద్‌లోని క్యాట్‌ను ఆశ్రయించారు. సుదీర్ఘకాలం పాటు ఇరుపక్షాల వాదనలు విన్న ట్రైబ్యునల్ ఎట్టకేలకు తీర్పు ఇచ్చింది. ఏబీవీ సస్పెన్షన్ చట్టవిరుద్ధమని ఒక సారి హైకోర్టు, సుప్రీంకోర్టు చెప్పాక కూడా రెండోసారి సస్పెండ్ చేయడమంటే అది వేధించడమేనని వ్యాఖ్యానించింది. ఆయనకు రావాల్సిన బకాయిలన్నీ చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
2019 మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జగన్‌మోహన్‌రెడ్డి ఆ వెంటనే ఏసీబీ డైరెక్టర్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావును అక్కడి నుంచి బదిలీ చేసి సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశాలిచ్చారు. అది మొదలు 8 నెలల పాటు ఆయనకు ఏ పోస్టింగూ ఇవ్వలేదు. జీతభత్యాలు చెల్లించలేదు. సుదీర్ఘకాలం పాటు వేచి చూసిన ఆయన పోస్టింగ్, జీతభత్యాల కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి దరఖాస్తు చేసుకోగా నిఘా, భద్రతా పరికరాల కొనుగోలు వ్యవహారంలో అవినీతికి పాల్పడ్డారనే అభియోగాలు మోపుతూ 2020 ఫిబ్రవరి 8న సస్పెండ్ చేశారు. అసలు ఆ నిఘా పరికరాలు కొనలేదు, వాటికోసం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు.
ప్రభుత్వ ఖజానాకూ నష్టం వాటిల్లలేదు. ఈ వ్యవహారంలో ఎవరికీ అనుచిత ప్రయోజనమూ కలగలేదు. అయినా సరే... తాము ముందుగా రూపొందించుకున్న అభియోగాలతో ఏబీ వెంకటేశ్వరరావుపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద ఏసీబీ కేసు నమోదు చేశారు. ఈ సస్పెన్షన్‌ను సవాల్ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘకాలం పాటు విచారించిన హైకోర్టు ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ అక్రమం, చట్టవిరుద్ధమంటూ తీర్పు ఇచ్చింది. దీన్ని రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేయగా అత్యున్నత న్యాయస్థానం ఆ పిటిషన్‌లో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. సస్పెన్షన్ రద్దు చేయాలని 2022 ఏప్రిల్ 22న ఆదేశాలిచ్చింది.
ఎన్నికల వేళ - పల్నాడు జిల్లాలో బాంబుల కలకలం - police Found Bomb in Palnadu
సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత కూడా జగన్ ప్రభుత్వం ఆయనకు వెంటనే పోస్టింగ్ ఇవ్వలేదు. ఆయన పదే పదే ఆ తీర్పు ప్రతులను, వినతిపత్రాలను సీఎస్‌కు ఇవ్వడంతో తప్పనిసరి పరిస్థితుల్లో 2022 జూన్ 14న ఆయన్ను విధుల్లోకి తీసుకున్నారు. అత్యంత అప్రాధాన్యమైన పోస్టింగ్‌గా భావించే ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగం కమిషనర్‌గా నియమించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏబీవీని విధుల్లోకి తీసుకున్నట్టే తీసుకున్న జగన్ ప్రభుత్వం తర్వాత 14 రోజుల్లోనే, అంటే 2022 జూన్ 28న మళ్లీ సస్పెండ్ చేసింది. నిఘా, భద్రత పరికరాల కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగాలతో నమోదైన కేసులో ఆయన సాక్షుల్ని ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్నారంటూ సస్పెండ్ చేసింది. ఆయనను డిస్మిస్ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. అప్పటి నుంచి ఆయన సస్పెన్షన్‌లోనే ఉన్నారు. ఒకే ఆరోపణ, అభియోగంపై రెండుసార్లు సస్పెండ్ చేయటం జగన్ ప్రభుత్వానికే చెల్లింది.