తెలంగాణ

telangana

ETV Bharat / state

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్​పై కేసు నమోదు - CASE ON ALLU ARJUN

సంధ్య థియేటర్‌ ఘటనపై అల్లు అర్జున్​తోపాటు థియేటర్ యాజమాన్యం, సెక్యూరిటీ మేనేజరుపై కేసు నమోదు చేసిన పోలీసులు - బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు డీసీపీ ప్రకటన

ase on Allu arjun Team against Stampede
Police Case on Allu arjun Team (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 5, 2024, 7:04 PM IST

Updated : Dec 5, 2024, 9:56 PM IST

Police Case on Allu arjun Team against Stampede :సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జరిగిన ఘటనపై చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌లో బీఎన్ఎస్ యాక్టీవ్​లోని 105 ,118(1), రెడ్ విత్ 3(5) సెక్షన్ల కింద అల్లు అర్జున్​తోపాటు థియేటర్ యాజమాన్యం, సెక్యూరిటీ మేనేజరుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు హీరో అల్లు అర్జున్​కు నోటీసులు జారీ చేస్తామని సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంశ్ యాదవ్ వెల్లడించారు. అల్లు అర్జున్​తో పాటు థియేటర్ యాజమాన్యం, సెక్యూరిటీ మేనేజరుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సెంట్రల్‌ జోన్‌ డీసీపీ అక్షాంశ్‌ యాదవ్‌ మీడియాకు వెల్లడించారు. బుధవారం పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్​లో తొక్కిసలాట ఘటన జరగడం దురదృష్టకారమని డీసీపీ పేర్కొన్నారు. బుధవారం రాత్రి 9.40 సమయంలో పుష్ప 2 ప్రీమియర్ షోను సంధ్య థియేటర్ యజమాన్యం ఏర్పాట్లు చేశారని తెలిపారు. హీరో అల్లు అర్జున్ వస్తున్నారని సమాచారం తెలుసుకున్న అభిమానులు భారీగా తరలివచ్చారని, ప్రేక్షకులను అదుపు చేయడానికి పోలీసులు ప్రయత్నించినా సఫలం కాలేదని వివరించారు. సినిమా వీక్షించేందుకు అల్లు అర్జున్ రావడంతో పరిస్థితి అదుపు తప్పిందని, ఆయన వస్తున్నారని తెలుసుకున్న అభిమానులు భారీగా తరలివచ్చారని చెప్పారు.

'అల్లు అర్జున్ వచ్చాక భద్రతా సిబ్బంది ప్రేక్షకులను అదుపుచేసే క్రమంలో నెట్టేయడంతో తోపులాట ఆ తరువాత తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి కుటుంబం చిక్కుకుపోయింది. అధిక సంఖ్యలో అభిమానులు ఉండటంతో వారికి ఊపిరాడలేదు. ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం'- అక్షాంశ్‌ యాదవ్‌, సెంట్రల్‌ జోన్‌ డీసీపీ

భద్రతా సిబ్బంది ప్రేక్షకులను నెట్టి వేయడంతోనే : ప్రేక్షకులతోపాటు సినిమాలో నటించిన కీలక నటులు ప్రీమియర్ షోకు హాజరవుతారన్న సమాచారం పోలీసులకు రాలేదని డీసీపీ అక్షాంశ్‌ యాదవ్‌ చెప్పారు. థియేటర్ యాజమాన్యం కూడా ఇలాంటి ముందస్తు భద్రత చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. ఎంట్రీ ఎగ్జిట్​లలో కూడా ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదని, నటీనటులకు కూడా ఎటువంటి ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేయలేదని వివరించారు. అల్లు అర్జున్ థియేటర్ లోపలికి వెళ్లిన సమయంలో భద్రతా సిబ్బంది ప్రేక్షకులను నెట్టి వేయడంతో పరిస్థితి అదుపు తప్పిందని, అప్పటికే థియేటర్ లోపల బయట ప్రేక్షకులు కిక్కిరిసి ఉన్నారని తెలిపారు.

థియేటర్​లోని లోయర్ బాల్కనీలోకి అల్లు అర్జున్ లోపలికి వెళ్లారని, ఆ క్రమంలో ప్రేక్షకులకు మధ్య తోపులాట చోటు చేసుకుందని డీసీపీ అక్షాంశ్‌ యాదవ్‌ అన్నారు. ఈ నేపథ్యంలో దిల్​సుఖ్​నగర్​కు చెందిన రేవతి, ఆమె కుమారుడు శ్రీతేజ్ ఉన్నారని, అధిక సంఖ్యలో ప్రేక్షకులు ఉండటంతో వారికి ఊపిరాడలేదని తెలిపారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది వారిని కాపాడే ప్రయత్నం చేశారని, కానీ అప్పటికే రేవతి మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారని డీసీపీ చెప్పారు.

'సంధ్య థియేటర్‌' ఘటన - స్పందించిన బన్నీ టీమ్ - ఏమందంటే?

'హీరో అల్లు అర్జున్‌ 'పుష్ప 2' సినిమా ప్రదర్శించడం లేదు' - ప్రసాద్‌ మల్టీప్లెక్స్ కీలక నిర్ణయం

Last Updated : Dec 5, 2024, 9:56 PM IST

ABOUT THE AUTHOR

...view details