ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏలూరులో కాల్​మనీ ఆగడాలు - మంగళవారం వచ్చిందంటే బాధితులకు వణుకు - Call Money Harassment in Eluru - CALL MONEY HARASSMENT IN ELURU

Eluru Call Money Victims Issues : మంగళవారం వచ్చిందంటే చాలు వారిలో భయం మొదలవుతుంది. ఈ వారం ఎంత వడ్డీ కట్టమంటారో? ఎక్కడి నుంచి తేవాలో కట్టలేకపోతే ఎలాంటి బెదిరింపులు ఎదురవుతాయో? అనే భయం వారిని నిద్రపోనివ్వకుండా చేస్తుంది. అసలుకి అసలు వడ్డీకి వడ్డీ కట్టినా సరే డబ్బుల రూపంలో మనుషుల రక్తం తాగే వారి అత్యాశకు సరిపోయేది కాదు. ఉన్నదంతా ఊడ్చి వారి చేతుల్లో ధారపోసినా ఇంకా కట్టాల్సిందేననే సమాధానం విని బాధితుల గుండెలు బరువెక్కేవి. ఇదంతా దేని గురించి అనుకుంటున్నారా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక నేతలు సాగించిన కాల్‌మనీ దందాకు బలైన బాధితుల ఆవేదన.

Call Money Harassment in Eluru
Call Money Harassment in Eluru (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 30, 2024, 12:44 PM IST

Call Money Harassment in Eluru : ఏలూరు జిల్లాలో వైఎస్సార్సీపీ నేతల కాల్ మనీ ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. అమాయక ప్రజల అవసరాలను ఆసరాగా తీసుకుని ఏలూరుకు చెందిన స్థానిక నాయకుడు మేడపాటి సుధాకర్​రెడ్డి అప్పటి ప్రభుత్వ పెద్దల అండ చూసుకుని చేసిన అరాచకాలకు అడ్డే లేకుండా పోయింది. డబ్బులు ఇచ్చే సమయంలో 2 రూపాయల వడ్డీ అని చెప్పి ష్యూరిటీగా ఖాళీ ప్రామిసరీ నోట్లపై సంతకాలు, పదుల సంఖ్యలో చెక్కులు తీసుకోవడం అతని నైజం.

ప్రతి మంగళవారం ఠంఛన్‌గా అసలు, వడ్డీ చెల్లిస్తే సరి. చెప్పిన సమయానికి ఒక గంట ఆలస్యమైనా అంతే సంగతి. వడ్డీకి వడ్డీ చెల్లించాల్సిందే. ఒక వారం ఆలస్యమైతే చాలు లక్షల్లో బాకీ పడాల్సిందే. అదేమని ప్రశ్నిస్తే ప్రామిసరీ నోట్లు, బ్యాంకు చెక్కులు అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడటం, మహిళలని కూడా చూడకుండా రాత్రులు ఇళ్లకు వచ్చి సుధాకర్​రెడ్డి, అతని అనుచరులు అసభ్యంగా ప్రవర్తించేవారని బాధితులు వాపోయారు.

"ఇంట్లో బంగారం, వస్తువులన్నీ అమ్మేసి అప్పులు కట్టాం. ఇంటికి వచ్చి చాలా అసభ్యంగా ప్రవర్తించేవారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. మేడపాటి సుధాకర్​రెడ్డి వల్ల వేరే ప్రాంతాల్లో నివసిస్తున్నాం. ఇప్పుడు ప్రామిసరీ నోట్లు, బ్యాంకు చెక్కులను అడ్డుపెట్టుకొని కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. సుధాకర్​రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం." - బాధితులు

Call Money Scam in Eluru :ప్రామిసరీ నోట్లపై సంతకాలు చేయడం, చెక్కులు ఇవ్వడంతో పరువుపోతుందనే భయంతో పలువురు బాధితులు సుధాకర్‌రెడ్డి అడిగినంత చెల్లించారు. అయినా ఇంకా చెల్లించాలని అనే వారని ఆవేదన వ్యక్తం చేశారు. అతని దురాగతాలపై గతంలో పోలీసు కేసు పెట్టినా, స్పందనలో ఫిర్యాదు చేసినా ప్రయోజనం శూన్యమని చెప్పారు. దీంతో చేసేది లేక కష్టం ధారపోసి రక్తాన్ని డబ్బులుగా మార్చి అసలు, వడ్డీ కట్టామని వాపోయారు. ఇక కట్టలేమని చెప్పడంతో ప్రస్తుతం ప్రామిసరీ నోట్లు, బ్యాంకు చెక్కులను అడ్డుపెట్టుకుని కోర్టుల చుట్టూ తిప్పిస్తున్నాడని బాధితులు తమ గోడును వెళ్లబోసుకున్నారు.

"బాధితులకు అండగా ఉంటాం. వారి దగ్గర ఉన్న ఆధారాలను ఇచ్చారు. వడ్డీలకు వడ్డీ కట్టలేక బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. వారికి పార్టీ తరఫున న్యాయం చేస్తాం. సుధాకర్​రెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. సుధాకర్​రెడ్డి ఆగడాలకు తట్టుకోలేక సర్వసం కోల్పోయామని బాధితులు తెలిపారు. - బడేటి రాధాకృష్ణయ్య, ఏలూరు ఎమ్మెల్యే

కూటమి ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని భావించి ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యను ఆశ్రయించి బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. బాధితులకు అండగా ఉంటామని పార్టీ తరఫున న్యాయ సహాయం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. సుధాకర్​రెడ్డిపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని రాధాకృష్ణయ్య చెప్పారు. మరోవైపు మేడపాటి సుధాకర్​రెడ్డి ఆగడాలకు ఇప్పటికే కొంతమంది సర్వస్వం కోల్పోగా మరికొందరు ఊరు వదిలివెళ్లిపోయినట్లు బాధితులు చెబుతున్నారు.

Sexual Harassment : బాయ్ ఫ్రెండ్ కోసం అప్పు చేస్తే... అదే అదనుగా..!

'విజయవాడ కాల్ మనీ వ్యాపారుల నుంచి కాపాడండి'

ABOUT THE AUTHOR

...view details