CAG Report on Telangana Financial Condition :2022మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్(కాగ్) నివేదిక ఇచ్చింది. 2021-22లో తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి అధిక వృద్ధిరేటును నమోదు చేసిందని కాగ్ పేర్కొంది. 26శాతం మేర రెవెన్యూ రాబడి పెరిగినా, రెవెన్యూ మిగులును సాధించడంతో రాష్ట్రం వరుసగా మూడో ఏడాది విఫలమైందని పేర్కొంది. ద్రవ్యలోటు రుణ బాధ్యతల లక్ష్యాలను సాధించలేకపోయిందని వివిధ కారణాల దృష్ట్యా రెవెన్యూను రూ.1,157కోట్ల మేర తక్కువ చేసి చూపిందని తెలిపింది. వడ్డీ చెల్లింపు బాధ్యతలను నేరవేర్చకపోవడం వల్ల ద్రవ్యలోటు(Fiscal Deficit)ను కూడా రూ.182కోట్ల మేర తక్కువగా చూపినట్లు తెలిపింది.
రాష్ట్ర బడ్జెట్ నుంచి చెల్లిస్తున్న బడ్జెట్ వెలుపలి అప్పులు, ఇతర చెల్లింపు బాధ్యతలను కూడా పరిగణలోని తీసుకుంటే జీఎస్డీపీ(GSDP)లో అప్పుల నిష్పత్తి 37.77శాతంగా ఉంటుందని చట్టప్రకారం నిర్దేశించిన 25శాతం కంటే ఎక్కువగా ఉంటుందని కాగ్ తెలిపింది. 15వ ఆర్థిక సంఘం నిర్దేశించిన 29.30శాతం కన్నా కూడా ఎక్కువగా ఉందని పేర్కొంది. రెవెన్యూ రాబడి ఎక్కువ చూపి రెవెన్యూ లోటును తక్కువ చూపి ఇచ్చిన రుణాల రూపంలోని ఆస్తులను ఎక్కువగా చేసి చూపినట్లు అయిందని కాగ్(CAG) వ్యాఖ్యానించింది. మొత్తం వ్యయంలో తప్పనిసరి ఖర్చుల వాటా పెరిగిందని విద్యా, ఆరోగ్యం మీద వ్యయం విషయంలో రాష్ట్రం ఇతర రాష్ట్రాలతో వెనుకంజలోనే ఉందని కాగ్ తెలిపింది.
CAG report on Telangana state taxes : రాష్ట్ర ఖజానాకు కాసుల పంట.. కాగ్ నివేదిక విడుదల
CAG Audit Report of Telangana : మొత్తం వ్యయంలో విద్య మీద 8శాతం ఖర్చు కాగా ఆరోగ్యం మీద 4శాతం ఖర్చయిందని కాగ్ పేర్కొంది. రాష్ట్ర వనరుల నుంచి అప్పులకు సంబంధించి చెల్లిస్తున్న రూ.1,18,955 కోట్ల మేర రుణాలను కూడా ప్రభుత్వం వెల్లడించలేదని జీఎస్డీపీ, అప్పుల నిష్పత్తిపై ఈ ప్రభావం ఉంటుందని వ్యాఖ్యానించింది. రెవెన్యూ లోటు (Revenue Deficit) నమోదు చేసినందున ఆ లోటును మార్కెట్ నుంచి తీసుకున్న అప్పుల ద్వారానే భర్తీ చేయాల్సి వస్తుందని తెలిపింది. రుణాల మీద వడ్డీ, అసలు కోసం 2032-33నాటికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2,52,048 కోట్లను తీసుకోవాల్సి వస్తుందని ఇది ప్రభుత్వ ఆర్థికాన్ని గణనీయమైన ఒత్తిడికి గురిచేస్తుందని వ్యాఖ్యానించింది.