తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్రమాలకు అడ్డాగా జీహెచ్ఎంసీ - కాగ్ నివేదికలో సంచలన విషయాలు - CAG report on GHMC corruption - CAG REPORT ON GHMC CORRUPTION

CAG report : జీహెచ్‌ఎంసీలో అక్రమాలపై కాగ్‌ సంచలన విషయాలను వెల్లడించిది. (2019-20, 2020-21) జీహెచ్‌ఎంసీలో యథేచ్ఛగా నిధుల దుర్వినియోగం జరుగిందని ఆరోపించింది. ఆస్తిపన్ను మదింపు, వసూళ్లు, శిథిల భవనాల కూల్చివేత, ట్రేడ్‌ లైసెన్సుల జారీ,డ్రైనేజీల నిర్మాణం, నాలాలు, ఇతరత్రా పనుల్లో అక్రమాలు చోటుచేసుకున్నట్లు కాగ్ తన నివేదికలో పేర్కొంది.

CAG report
CAG report (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 3, 2024, 8:39 AM IST

CAG report On GHMC Corruption : గ్రేటర్‌ హైదరాబాద్‌ నగర పాలక సంస్థ అక్రమాలకు అడ్డాగా మారిందని కాగ్‌ నివేదిక తన నివేదికలో వెల్లడించింది. జీహెచ్‌ఎంసీలో యథేచ్ఛగా నిధుల దుర్వినియోగం జరుగుతోందని ఆరోపించింది. ఆస్తిపన్ను మదింపు, వసూళ్లు, శిథిల భవనాల కూల్చివేత, ట్రేడ్‌ లైసెన్సుల జారీ,డ్రైనేజీల నిర్మాణం, నాలాలు, ఇతరత్రా పనుల్లో (2019-20, 2020-21) ఆర్థిక సంవత్సరాలకు) జరిగిన అవకతవకలపై శుక్రవారం అసెంబ్లీకి కాగ్‌ నివేదిక సమర్పించింది. అధికారుల చేతివాటం వల్ల జీహెచ్‌ఎంసీ ఖజానాకు రూ.కోట్లలో నష్టం వాటిల్లినట్టు కాగ్ పేర్కొంది.

కార్వాన్‌ పరిధిలో ట్రేడ్‌ లైసెన్సుల అక్రమ మదింపు వల్ల ఖజానాకు రూ.37.97లక్షల నష్టం జరిగిందని కాగ్ తెలిపింది. పలు యాడ్‌ ఏజెన్సీల నుంచి జీహెచ్‌ఎంసీకి రావాల్సిన రూ.2.55లక్షలను వసూలు చేయలేదని పేర్కొంది. చందానగర్‌లో ఇళ్ల కేటగిరీలో ఉన్న భవనాల్లో వ్యాపారాలను నిర్వహిస్తున్నారని, వాటికి ట్రేడ్‌ లైసెన్సులూ ఇచ్చారు. ఆస్తిపన్నును వాణిజ్య కేటగిరీకి మార్చలేదని పేర్కొంది. దీంతో రూ.కోట్లలో నష్టం వాటిల్లినట్లు కాగ్ తన నివేదికలో తెలిపింది.

2020-21 ఆర్థిక సంవత్సరంలో కాప్రా సర్కిల్‌లోని ఓ బిల్‌ కలెక్టర్‌ రూ.63,011, ఖైరతాబాద్‌ సర్కిల్‌కు చెందిన తొమ్మిది మంది బిల్‌కలెక్టర్లు రూ.6.32 లక్షలు, ముషీరాబాద్‌ సర్కిల్‌లో రూ.48.65లక్షలను 10 మంది బిల్‌కలెక్టర్లు, ఖైరతాబాద్‌ సర్కిల్‌లోని 23 మంది బిల్‌కలెక్టర్లు రూ.23.60లక్షలు, దారి మళ్లించినట్లు కాగ్ నివేదికలో వెల్లడించింది. మల్కాజిగిరి సర్కిల్‌లో ఇద్దరు బిల్‌కలెక్టర్ల అక్రమ మదింపుతో జీహెచ్‌ఎంసీకి ఏటా రూ.4 లక్షల నష్టం జరుగుతోందని పేర్కొంది.

బోయిన్‌పల్లి మార్కెట్‌ కమిటీలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి మార్కెట్‌ అద్దె, జీఎస్టీ వసూళ్లలో జమా ఖర్చుల్లో రూ.61.07లక్షల తేడా కనిపించినట్లు కాగ్ తెలిపింది. వ్యాపారుల నుంచి చెక్కుల రూపేణా తీసుకున్న సొమ్మును బ్యాంకులో జమచేయగా, అందులో చెక్కులు చెల్లక రూ.31.97లక్షల నష్టం జరిగిందని వెల్లడించింది.

ధరణితో సరికొత్త విప్లవం అన్నారు - కొత్త సమస్యలు తెచ్చిపెట్టారు : మంత్రి పొంగులేటి - DHARANI PORTAL ISSUE IN TG ASSEMBLY

అదనపు పింఛన్లతో రూ.4.56 కోట్ల నష్టం : 2019-20 సంవత్సరానికి సికింద్రాబాద్‌ సర్కిల్‌ ఆడిట్‌ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఖజానాకు రూ.4,56,23,917 నష్టం వాటిల్లిందని కాగ్ నివేదిక తెలిపింది. తెలంగాణ రివైజ్ట్‌ పింఛన్‌ రూల్స్‌ - 1980లోని సెక్షన్‌ 50 ప్రకారం, ప్రభుత్వ ఉద్యోగి విధుల్లో ఉన్నప్పుడు మరణిస్తే ఆయన సంబంధీకులకు ఏడేళ్లపాటు జీతంలో సగం మొత్తాన్ని పింఛనుగా అందిస్తారు. అనంతరం ఆ మొత్తాన్ని 30శాతానికి తగ్గించాల్సి ఉంటుంది. ఆడిట్‌ అధికారులు ఆ విషయాన్ని పట్టించుకోలేదని, తద్వారా వందలాది మంది ఉద్యోగులకు ఏడేళ్లపాటు ఇచ్చిన పింఛను మొత్తాన్ని అలాగే కొనసాగించినట్లు కాగ్ తెలిపింది. అదనపు పింఛన్లు, ట్రేడ్‌ లైసెన్సుల్లో అవకతవకలు, ఇతరత్రా తప్పిదాల వల్ల గోషామహల్‌ సర్కిల్‌లో రూ.50లక్షలు ఆదాయానికి గండి పడినట్లు కాగ్ తన నివేదికలో స్పష్టం చేసింది.

కూకట్‌పల్లి సర్కిల్‌ కార్యాలయం భూగర్భ డ్రైనేజీ పనుల కోసం అనుమతి లేకుండా కాంట్రాక్టరుకు రూ.1,35,266లు చెల్లించినట్లు కాగ్ గుర్తించింది. అల్వాల్, చాంద్రాయణగుట్ట సర్కిళ్లలో హైటెన్షన్‌ వైర్లను పక్కకు జరిపే పనులు జరగకుండానే జీహెచ్‌ఎంసీ అధికారులు బిల్లులు చెల్లించినట్లు కాగ్ వెల్లడించింది. అల్వాల్‌ సర్కిల్‌లో రూ.11,85,757, చాంద్రాయణగుట్టలో రూ.23,18,130 పక్కదారి పట్టాయని పేర్కొంది. చందానగర్‌ సర్కిల్‌లో పరిధిలో వేర్వేరు పనులకు సంబంధించి గుత్తేదారులకు రూ.1.75 కోట్లు అదనంగా చెల్లించారని కాగ్ తన నివేదికలో పొందుపరిచింది. ఇలా జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమాలపై కాగ్ తన నివేదికను వెల్లడించింది.

తెలంగాణ రెవెన్యూ రాబడులు గణనీయంగా 17 శాతం పెరిగాయి : కాగ్ రిపోర్ట్ - CAG Report in Telangana Assembly

ABOUT THE AUTHOR

...view details