Building Construction Worker card:రోజంతా రెక్కాడితే గానీ డొక్కాడని కూలీ కుటుంబాలవి. చేతినిండా పని దొరికితేనే కడుపు నిండే పరిస్థితి. ప్రతిరోజూ ఉదయం కూలీల అడ్డాల వద్ద పనుల కోసం ఆశగా ఎదురు చూస్తుంటారు. పనులు దొరకని సమయంలో నిరాశగా ఇంటికి వెళ్లిపోయి పస్తులు ఉంటారు. భవన నిర్మాణ రంగంలో పనిచేసే దినసరి కార్మికుల పరిస్థితి ఇలా ఉంటుంది. ఈ క్రమంలోనే భవన నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ భవన, ఇతర కార్మిక సంక్షేమ మండలి పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. అయితే, ఈ ప్రయోజనాలను అందిపుచ్చుకోవాలంటే రిజిస్ట్రేషన్ కార్డు తప్పనిసరిగా అవసరం ఉంటుంది. ఇందులో సభ్యుడిగా చేరడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఈ కార్డును ఎలా తీసుకోవాలి? ఇందువల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎవరు అర్హులు?:ఈ కార్డు పొందాలనుకునే భవన నిర్మాణ కార్మికుల వయసు తప్పనిసరిగా 18 నుంచి 60 ఏళ్లలోపు ఉండాలి. కార్మికుడిగా నమోదు చేయించుకునే రోజు నాటికి 12 నెలల్లో తప్పనిసరిగా 90 రోజులకు తగ్గకుండా భవన, ఇతర నిర్మాణ రంగంలో పనిచేసి ఉండాలి. తాపీమేస్త్రీ, హెల్పర్, సెంట్రింగ్ వర్కర్, పెయింటర్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, టైల్స్, వెల్డింగ్ ఇలా 54 రంగాల భవన నిర్మాణ కార్మికులు దీనిని పొందొచ్చు.
ఎలా నమోదు చేసుకోవాలి?:భవన నిర్మాణ రంగ కార్మికులుగా నమోదు చేసుకోవాలని అనుకున్న వారు.. ఫొటో, ఆధార్, రేషన్‌కార్డు, బ్యాంకు పాస్‌బుక్, పని వివరాలను సంబంధిత ఫారంలో నింపాలి. ఆ తర్వాత దానిని మీ సేవా ద్వారా రుసుము రూ.110 చెల్లించి సమర్పించాలి. ఆ తర్వాత దరఖాస్తు పత్రాలను జిల్లా కార్మిక శాఖ కార్యాలయంలో ఇవ్వాలి. అనంతరం మీ దరఖాస్తును అధికారులు పరిశీలించి కార్డు జారీ చేస్తారు. దీని గడువు సుమారు ఐదేళ్ల వరకు ఉంటుంది. ఆ తర్వాత దీనిని రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది.