Budvel Assigned Lands Case Update :రెవెన్యూ, మున్సిపల్, హెచ్‌ఎండీఏ పత్రాలు పరిశీలించగా, మాజీ ఐపీఎస్ అధికారి మాండ్ర శివానంద రెడ్డి పథకం ప్రకారం భూములు కొట్టేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బుద్వేల్‌లోని 26 ఎకరాలఅసైన్డ్ భూముల వ్యవహారంలో జరిగిన అవకతవకలు, సీసీఎస్‌లో నమోదైన 4 కేసుల దర్యాప్తులో వెల్లడైన అంశాలపై సీసీఎస్ డీసీపీ శ్వేత ఓ ప్రకటన విడుదల చేశారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్‌లో 281 ఎకరాల భూమిని ప్రభుత్వం 1994లో కొందరికి కేటాయించింది. అనంతరం భూములను స్వాధీనం చేసుకుంటూ ఆర్టీవో ఇచ్చిన ఆదేశాలు రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆ సమయంలో కేటాయించిన స్థలంలో అభివృద్ధి చేసి ప్లాట్లు ఇవ్వాలని లబ్ధిదారులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ వ్యవహారం ప్రభుత్వం దగ్గర పెండింగ్‌లో ఉండగా, కొందరు కుట్రకు తెరతీశారు.
టీజే ప్రకాశ్, కోనేరు గాంధీ, దశరథ రామారావుతో పాటు మరికొందరు పట్టాదారుల్ని కలిసి ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న సమస్య పరిష్కరిస్తామని అధికారులు, రాజకీయ నాయకుల నుంచి ఇబ్బంది రాకుండా చూస్తామని నమ్మించారు. నిజమేనని భావించిన పట్టాదారులు 69 వేల 200 చదరపు గజాల స్థలంపై టీజే ప్రకాశ్, కోనేరు గాంధీ, దశరథ రామారావుతో కలిసి ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం చూపించి గూడూరు కృష్ణ, రవి రాంబాబు, రాఘవరావు వద్ద పెట్టుబడికి నగదు తీసుకున్నారు.
Ex IPS Shivanand Reddy Plans Assigned Land Occupation : అసైన్డ్ భూముల విక్రయాలు, హక్కుల బదలాయింపుపై నిషేధం ఉందని తెలిసినా భూములను రిజిస్టర్ చేయిస్తామని నమ్మించి ఆ డబ్బు తీసుకున్నారు. 2022లో మోసం చేసి పెట్టుబడి పేరిట డబ్బు వసూలు చేశారని గూడూరు కృష్ణ, రవిరాంబాబు, రాఘవరావు సీసీఎస్‌లో ఫిర్యాదు చేయగా నాలుగు కేసులు నమోదు చేశారు. పాట్లు కేటాయించేలా చూడాలంటూ స్థానిక రియల్టర్ దయానంద్‌ను పట్టాదారులు సంప్రదించాగా శివానందరరెడ్డి జోక్యం మొదలైంది.