Budget Allocation Funds to Amaravati Capital Region :బడ్జెట్లో నిధులు కేటాయించడంతో రాజధాని అమరావతికి మహర్దశ పట్టనుంది. మౌలిక వసతులు, అభివృద్ధి పనులకు రూ. 3 వేల కోట్లకు పైగా కేటాయించడంతో రాజధాని పనులు పరుగులు పెట్టనున్నాయి. ఇప్పటికే ప్రపంచబ్యాంకు, ఏడీబీల నుంచి రుణ ప్రకటన వెలువడగా ఇప్పుడు బడ్జెట్లో కేటాయింపులు జరపడంతో చట్టబద్ధంగా నిధులు విడుదల కానున్నాయి.
రాజధాని అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ :ప్రజా రాజధాని విధ్వంసమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ హయాంలో అమరావతిలో నిర్మాణాలు నిలుపుదల చేయగా కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజధాని అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇప్పటికే పిచ్చి మొక్కలు తొలగింపు, రహదారుల మరమ్మతులు చేపట్టగా త్వరలోనే పెండింగ్ పనుల పూర్తికి టెండర్లు పిలవనున్నారు. ప్రపంచ బ్యాంకు రుణానికి ఆమోదం లభించిన రోజే రాష్ట్ర బడ్జెట్లోనూ రాజధాని నిర్మాణానికి కేటాయింపులు చేశారు. మౌలిక వసతులకు రూ. 3 వేల కోట్లు, భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లింపులకు రూ. 400 కోట్లు, అమరావతి స్మార్ట్‌సిటీస్ కార్యక్రమంలో భాగంగా సిటీస్ ఛాలెంజ్ ప్రాజెక్టు కింద అభివృద్ధి పనులకు రూ. 32 కోట్లు, హైకోర్టు భవనంలో వసతులకు రూ. 13 కోట్లు వెచ్చించనుంది. మూడేళ్లలో తొలిదశ పనులు పూర్తిచేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు చేయడంతో పనులు పరుగులు పెట్టనున్నాయి. మహానగరికి మహర్దశ - నవ రాజధానికి రూ.3,445 కోట్లు
బడ్జెట్ల్‌లో రాజధాని నిర్మాణానికి కేటాయింపులు :రాజధాని నిర్మాణ అంచనా వ్యయం రూ. 50 వేల కోట్లు కాగా ప్రపంచ బ్యాంకు, ఏడీబీల నుంచి రూ.15 వేల కోట్లు రుణాల రూపంలో మంజూరయ్యాయి. హడ్కో రూ. 12 వేల కోట్ల రుణానికి సూత్రప్రాయంగా అంగీకరించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర సంస్థల నుంచి రుణాలు, బాండ్ల ద్వారా మరో రూ. 23 వేల కోట్లు సమీకరించనున్నారు. దీంతో అమరావతికి ఆర్థిక వనరుల లోటు తొలగింది. ప్రపంచబ్యాంకు, ఏడీబీ ఇచ్చే నిధుల్ని సీఆర్‌డీఏ (CRDA)కు మళ్లించేందుకు బడ్జెట్‌లో ప్రత్యేక హెడ్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులిచ్చింది. ఆ హెడ్ కిందే బడ్జెట్‌లో రూ. 3వేల కోట్లు చూపించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇక 4 నెలలే మిగిలి ఉన్నాయి. రాజధాని పనుల్ని ప్రారంభించేందుకు ప్రస్తుతానికి ఆ నిధులు సరిపోనున్నాయి.
అమరావతికి రైలు కూత - కొత్త లైన్‌పై హర్షాతిరేకాలు - త్వరలోనే భూసేకరణ
అమరావతిని నిర్వీర్యం చేసిన వైఎస్సార్సీపీ : అమరావతిలో ఆగిపోయిన నిర్మాణాలు మరి కొద్ది రోజుల్లో ప్రారంభంకానున్నాయి. వాటిని పూర్తి చేయడంతో పాటు కొత్త నిర్మాణాలనూ ప్రారంభించేందుకు సీఆర్‌డీఏ సిద్ధమవుతోంది. రాజధానిలో రహదారులు, యుటిలిటీ డక్ట్‌లు, వరద నివారణ కాలువలు, రిజర్వాయర్ల నిర్మాణం, రైతులకు స్థలాలు కేటాయించిన లేఅవుట్‌ల అభివృద్ధి, శాసనసభ, హైకోర్టు, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల నిర్మాణం వంటి పనులకు సీఆర్‌డీఏ సుమారు రూ. 50 వేల కోట్లతో అంచనాలు సిద్ధం చేసింది. కౌలు చెల్లింపునకు బడ్జెట్‌లో కేటాయింపులు చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్మార్ట్ సిటీ నిధులను వేరే అవసరాలకు మళ్లించి అమరావతి అభివృద్ధికి మోకాలడ్డింది. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు కింద రాజధాని గ్రామాల్లో చేపడుతున్న మౌలిక వసతుల పనులకు బడ్జెట్‌లో రూ. 32 కోట్లు కేటాయించడం వల్ల ఇక ప్రగతి పరుగులు పెట్టనుంది.
ఆ రైల్వే స్టేషన్లకు నూతన సొబగులు - విమానాశ్రయాల తరహాలో తీర్చిదిద్దేలా హంగులు