BTech Ravi Followers Hulchul On Tenders Issue :పోటీదారులెవ్వరూ లోపలకి రాకుండా అనుచరగణంతో గుమ్మం వద్దే కాపుకాశారు. తమను కాదని టెండర్లు ఎలా వేస్తారో చూస్తామంటూ బెదిరింపులకు దిగారు. హెచ్చరికలకు తలొగ్గక వచ్చిన వారిపై గొడవ పెట్టుకుని టెండర్ సమయం మించిపోయే వరకు హంగామా సృష్టించారు. ఇదంతా ఏ మారుమూల ఫ్యాక్షన్ పల్లెలో జరిగిన తంతు కాదు జిల్లా కేంద్రం నడిబొడ్డున కడప కలెక్టరేట్‌లోనే పోలీసుల సమక్షంలో సాగడం విస్మయం కలిగిస్తోంది.
ప్రజలందరికీ ఉచిత ఇసుక అందించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఆ మహత్తర కార్యక్రమానికి ఆ పార్టీ నేతలే తూట్లు పొడుస్తున్నారు. ఇసుక ఉచితంగా ఇచ్చినా నదిలో నుంచి తవ్వితీయడం, రవాణాకు మాత్రమే ఛార్జీ వసూలు చేసుకునేలా ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. పోటీదారులు ఎక్కువ ఉంటే ధరలు తగ్గి ప్రజలకు మేలు జరుగుతుంది. కానీ వైఎస్‌ఆర్ జిల్లాలో మూడు ఇసుక రీచ్‌లు దక్కించుకునేందుకు టీడీపీ నేత బీటెక్ రవి అనుచరులు హల్‌చల్ సృష్టించారు.
కడప కలెక్టరేట్ కార్యాలయంలో ఇతరులెవ్వరూ టెండర్లు వేయకుండా అడ్డుకున్నారు. వైఎస్సార్ జిల్లాలో ఇప్పటికే ఉన్న రీచ్ల ద్వారా ఇసుక రవాణ చేస్తున్న నేతలు మరో మూడింటిని దక్కించు కోవడానికి బాహాబాహీకి దిగారు. ప్రధానంగా పులివెందులకు చెందిన టీడీపీ నేత బీటెక్ రవి అనుచరులు ఇసుక రీచ్ల టెండర్లు దక్కించుకోవడానికి ఎవ్వరినీ అటువైపు రాకుండా అడ్డుకున్నారు.
పగటిపూట పొదల్లో - రాత్రికాగానే రేవుల్లో!
పులివెందుల నియోజకవర్గంలోని చక్రాయపేట మండలంలో రెండు, సిద్ధవటం మండలంలో మరో ఇసుక రీచ్ కోసం టెండర్లు పిలిచారు. గురువారం సాయంత్రం 5.30 గంటల వరకు టెండర్లు దాఖలు చేయడానికి సమయం ఉండటంతో మధ్యాహ్నం 3గంటల నుంచే టీడీపీ నేత బీటెక్ రవి అనుచరులు మైనింగ్ కార్యాలయం వద్ద మకాం వేశారు. తాము తప్ప ఏ ఒక్కరూ టెండర్ వేయడానికి వీల్లేదని కార్యాలయం తలుపుల వద్ద అనుచరులు మోహరించారు.
కార్యాలయం లోపల అనుచరులు గడి పెట్టుకుని ఎవ్వరినీ రానీయకుండా అడ్డుకున్నారు. ఇదే సమయంలో కడప, వల్లూరు, కమలాపురం, దేవునికడప, సిద్ధవటం, ఒంటిమిట్ట ప్రాంతాలకు చెందిన టీడీపీ, జనసేన నాయకులు కూడా టెండర్లు వేయడానికి అక్కడికి వెళ్లారు. వారందరినీ కార్యాలయం బయటే నిలువరించారు. ఎవ్వరూ టెండర్ వేయడానికి వీల్లేదని బీటెక్ రవి అనుచరులు బెదిరింపులకు దిగారు.
మీడియా ప్రతినిధులు పోలీసులకు ఫోన్లు చేయడంతో కడప వన్ టౌన్ సీఐ రామకృష్ణ పోలీసు బలగాలతో మైనింగ్ కార్యాలయానికి చేరుకున్నారు. సీఐ వచ్చిన సమయంలో కూడా కూటమి నేతల మధ్య గొడవ జరిగింది. పోలీసులను సైతం లెక్కచేయకుండా తోసుకుంటూ వెళ్లారు. ఆగ్రహించిన సీఐ రామకృష్ణ కూటమి నేతలందరినీ బయటికి పంపించి వేశారు. సమయం ఉన్నంత వరకు టెండర్లు వేయడానికి వచ్చిన వారందరినీ లోపలికి అనుమతి ఇచ్చారు. మిగిలిన కూటమి నేతలు కూడా టెండర్లు దాఖలు చేశారు.
అనధికార రీచ్‌ల్లోకి వరుసకడుతున్న ట్రాక్టర్లు- అప్పుడూ ఇప్పుడూ అదే దందా!