Murder In Jangaon : తనకు పురుషత్వం లేదని అవమానించాడని ఆగ్రహించిన ఓ ఉన్మాది క్షణికావేశంలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు. ప్రణాళిక ప్రకారం ఇంటికే పిలిపించుకొని ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం : జనగామ జిల్లా ఎల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన గంపల పరశురాములు (40) తాపీ మేస్త్రీగా పని చేస్తున్నాడు. వచ్చిన డబ్బులతో భార్య, ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నాడు. అదే గ్రామానికి చెందిన పర్వత మహేందర్ అనే వ్యక్తి ఇంటి నిర్మాణం పనికి వెళ్తున్నాడు. ఆ సమయంలో పరశురాముల భార్య ఆరోగ్యం బాలేకపోవడంతో చికిత్స నిమిత్తం మహేందర్ దగ్గర కొంత డబ్బును అప్పుగా తీసుకున్నాడు. అప్పు తీర్చే విషయంలో ఇద్దరు కొంత కాలంగా గొడవలు పెట్టుకుంటున్నారు. దీంతో బుధవారం రాత్రి 12.45 గంటలకు మహేందర్ పరశురాములుకు పదే పదే ఫోన్ చేస్తూ ఇంటికి రమ్మనడంతో వెళ్లాడు. అంత రాత్రి ఎందుకు రమ్మన్నాడనే అనుమానంతో భార్య సంధ్య, కుమారుడు అనిరుద్ కనిపెట్టుకుంటూ ఆయన వెనకాలే వెళ్లారు.
అప్పటికే చేతిలో కత్తి పట్టుకుని ఉన్న మహేందర్ ‘నాకు పురుషత్వం లేదని అంటావా’ అని దుర్భాషలాడుతూ ఆవేశంలో కత్తితో పరశురాములు తలపై నరికాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య, కుమారుడు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. జనగామ పోలీసులు చేరుకొని మహేందర్‌ను అరెస్ట్ చేశారు. మృతదేహాన్నిశవ పరీక్షకు తరలించారు. భార్య సంధ్య గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.