BRS Rakesh Reddy Allegations On MLC Election Counting : వరంగల్-ఖమ్మంనల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా జరగడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఆరోపించారు. కౌంటింగ్ ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయన్నారు. కౌంటింగ్ ఏజెంట్ల సంతకాలు లేకుండానే లీడ్ ప్రకటించారన్నారు. సందేహాలను నివృత్తి చేయకుండా ఆర్వోలు ఏకపక్షంగా వ్యవహరించారని, అధికారులు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించలేదని చెప్పారు.ఇదేంటని అడిగితే పోలీసులు బయటకు నెట్టారన్నారు. ఓట్ల లెక్కింపు ఏకపక్షంగా జరుగుతోందని విమర్శించారు. సుమారు వెయ్యి ఓట్లు గోల్‌మాల్ అయ్యాయని ఆక్షేపించారు. ఎన్నికల సంఘం స్పందించి వెయ్యి ఓట్లతో పాటు ప్రతీ టేబుల్ దగ్గర ఓట్లలో ఉన్న అభ్యంతరాలు తీర్చాలని డిమాండ్ చేశారు.
Padi Kaushik Reddy Complaint:మరోవైపు ఎమ్మెల్సీ ఉపఎన్నిక లెక్కింపులో అవకతవకతలు జరుగుతున్నాయని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సీఈఓ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతో పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక లెక్కింపును ప్రభావితం చేస్తోందని ఆక్షేపించారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 3వ రౌండ్‌లో 533 ఓట్ల ఆధిక్యం వచ్చిందని టేబుల్ దగ్గర చెప్పిన అధికారులు ఆధిక్యం ప్రకటించే సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఆధిక్యంలో ఉన్నట్లుగా చెబుతున్నారని మండిపడ్డారు. 4వ రౌండ్‌లో ఓ టేబుల్ దగ్గర 170పై చిలుకు ఆధిక్యం వచ్చిందని చెప్పి తర్వాత తంతు కాంగ్రెస్ అనుగుణంగా నడిపించారని ఆరోపించారు. దీనిపై వెంటనే సీఈఓ వికాస్రాజ్తో పాటు రిటర్నింగ్ అధికారి సత్వరమే చర్యలు చేపట్టాలని కోరారు. ఆయన వెంట బీఆర్ఎస్ లీగల్ సెల్ సభ్యులు కూడా హాజరయ్యారు.