నేటి నుంచి బీఆర్ఎస్ లోక్‌సభ అభ్యర్థుల ఖరారు ప్రక్రియ BRS MP Candidates Finalization Process :అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్కు, లోక్‌సభ ఎన్నికలు సవాల్‌గా మారాయి. విపక్షంలో కూర్చున్న పరిస్థితుల్లో గులాబీపార్టీ నుంచి వలసలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీలోకి నేతలు తరలివెళ్తున్నారు. ఏకంగా ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు(Sitting MP) పార్టీని వీడగా, జడ్పీఛైర్మన్లు, పలుస్థాయిల్లోని ప్రజాప్రతినిధులు, మాజీలు, సీనియర్ నేతలు హస్తం, కమలం వైపు వెళ్తున్నారు.
మరికొంత మంది పార్టీని వీడతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మరికొందరు సిట్టింగ్ ఎంపీలు లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపట్లేదంటున్నారు. ఈ తరుణంలో లోక్‌సభ ఎన్నికల అభ్యర్థిత్వాల ఖరారు బీఆర్ఎస్కు తలనొప్పిగా మారింది. కొన్ని స్థానాల అభ్యర్థిత్వాలపైనే పార్టీలో స్పష్టత ఉందని చెప్పుకోవచ్చు. స్పష్టత వచ్చిన చోట్ల సదరు నేతలు పోటీకి అంతగా సుముఖంగా లేరని అంటున్నారు.
KCR Plans For Parliament Elections 2024 : లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ త్వరలోనే వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో అభ్యర్థిత్వాల ఖరారుపై అధినేత కేసీఆర్ దృష్టిసారించారు. వాస్తవానికి గత కొన్నాళ్లుగా వివిధ స్థాయిలోని నేతలతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంపీ అభ్యర్థులుగా ఎవరు పోటీచేస్తే బాగుంటుందనే అంశంపై నేతలనుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. వాటన్నింటి ఆధారంగా అభ్యర్థిత్వాలను ఫైనల్ చేసేందుకు కేసీఆర్(KCR) సిద్ధమవుతున్నారు.
త్వరలో బీఆర్ఎస్ లోక్‌సభ అభ్యర్థుల జాబితా - కేసీఆర్, కేటీఆర్ పోటీపై ఇదే క్లారిటీ
అందులో భాగంగా ఆయా లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. నేటి నుంచి ఆ ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నారు. ఇవాళ కరీంనగర్, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని నేతలతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ కానున్నారు. వారితో చర్చించి అభ్యర్థుల వ్యవహారాన్ని కొలిక్కి తేనున్నారు. కరీంనగర్ అభ్యర్థిగా మాజీ ఎంపీ వినోద్ కుమార్ పేరు దాదాపుగా ఖరారైనట్లే. సన్నాహక సమావేశం సందర్భంగానే నేతలు తీర్మానం చేశారు.
BRS Lok Sabha Meetings 2024 : పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్‌నేత పార్టీని వదిలి కాంగ్రెస్‌లో చేరడంతో మరో అభ్యర్థిని చూసుకోవాల్సి ఉంది. పెద్దపల్లి రేసులో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్(Former Minister Koppula Eswar) పేరు బలంగా వినిపిస్తోంది. సీనియర్‌నేత, ఉద్యమ సమయంనుంచి పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన ఈశ్వర్ సరైన అభ్యర్థి అని అంటున్నారు.
మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ పేరు ప్రచారంలో ఉన్నా, ఆయన ఆసక్తి లేదని అంటున్నారు. రెండు నియోజకవర్గాలకు సంబంధించిన నేతలతో చర్చించి అభ్యర్థిత్వాలను కేసీఆర్ ఖరారు చేయనున్నారు. ఇవాళ్టితో మొదలుకొని రోజుకు రెండు లేదా మూడు నియోజకవర్గాల నేతలతో సమావేశమై అభ్యర్థిత్వాల ఖరారు ప్రక్రియను పూర్తి చేయనున్నారు.
మెదక్ లోక్‌సభ అభ్యర్థ్విత్వం కోసం బీఆర్ఎస్‌లో తీవ్ర పోటీ - అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఆశావహులు
ఎంపీ సీటు కోసం మూడు పార్టీల్లోనూ తీవ్ర పోటీ - ఉమ్మడి పాలమూరులో అప్పుడే మొదలైన ఎన్నికల వేడి!