BRS MLA Tellam Venkat Rao Joined Congress :లోక్‌సభ ఎన్నికల గడువు సమీపిస్తున్న వేళ బీఆర్‌ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు(Bhadrachalam MLA Tellam Venkatarao) గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో పాటు ఆయన అనుచరులు కూడా కాంగ్రెస్‌లో చేరారు. ఈయన చేరికతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్‌కు వచ్చిన ఏకైక ఎమ్మెల్యే కూడా చేజారినట్లు అయింది. దీంతో అక్కడ బీఆర్‌ఎస్ పూర్తిగా ఖాళీ అయింది.
తెల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యేగా గెలిచిన మొదటి నుంచి బీఆర్‌ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చేవారు. అప్పుడే ఆయన పార్టీ మారుతారనే సంకేతాలు వచ్చాయి. కానీ వాటన్నింటిని ఆయన కొట్టిపడేశారు. ఆ తర్వాత కూడా గులాబీ పార్టీ భద్రాచలంలో ఏ కార్యక్రమం నిర్వహించిన, నల్గొండ సభకు, మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) సందర్శనకు ఆయన దూరంగా ఉంటూ వస్తుండేవారు. కానీ ఒక్కసారిగా భద్రాచలం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశానికి హాజరై కాంగ్రెస్‌లో చేరుతారన్న వాదనలకు బలాన్ని ఇచ్చారు.
కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిని ప్రకటించిన ఏఐసీసీ - నారాయణ శ్రీ గణేశ్‌కు ఛాన్స్
Lok Sabha Election 2024 : ఆ తర్వాత ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి పొంగులేటి సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అప్పుడు మీడియా ప్రశ్నిస్తే నియోజకవర్గ అభివృద్ధిపై మాట్లాడేందుకు సీఎంను కలిశానని చెప్పారు. శనివారం జరిగిన రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జరిగిన జన జాతర(Jana Jatara Sabha) భారీ బహిరంగ సమావేశానికి తెల్లం వెంకట్రావు హాజరయ్యారు. ఇప్పుడు అధికారికంగా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి బీఆర్‌ఎస్‌కు షాక్ ఇచ్చారు. ముఖ్యంగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మొదటి నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరుడు అనే మాటలు వినిపించాయి.