BRS MLA Harish Rao Fires On CM Revanth Reddy : తెలంగాణ ఉద్యమకారులపై తుపాకి ఎక్కుపెట్టిన వ్యక్తి ప్రస్తుతం సీఎంగా ఉన్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అలాగే లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections 2024) సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈసారి ఎన్నికల్లో గులాబీ పార్టీ సత్తా చాటేందుకు అందరూ కృషి చేయాలని సూచించారు.
'షాద్‌నగర్‌లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయాం. కనీసం ఇక్కడ మనకు ఎంపీ అయినా ఉండాలి. మనకి ఏదైనా సమస్యవస్తే ఎంపీ వచ్చి మనకు తోడుగా ఉంటాడు. అందుకు అందరూ కష్టపడాలి. ఎట్టి పరిస్థితుల్లో మహబూబ్‌నగర్‌లో గులాబీ జెండా ఎగురవేయాల్సిందే దానికి అందరు కార్యకర్తలు సిద్ధం అవ్వండి.' అని హరీశ్‌రావు అన్నారు.
'ఇచ్చిన గ్యారంటీలకు, బడ్జెట్ కేటాయింపులకు పొంతనే లేదు - బీజేపీ మౌనం వెనక మర్మమేంటి?'
తెలంగాణ ఉద్యమానికి శక్తినిచ్చిన నియోజకవర్గం షాద్‌నగర్ అన్నారు. ప్రత్యేక రాష్ట్ర పోరాట సమయంలో షాద్‌నగర్ ప్రజలు ఉద్యమంలో స్ఫూర్తిని నింపారని హరీశ్‌రావు గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించిందని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా కాంగ్రెస్‌ను వదిలిపెట్టమని అన్నారు. కార్యకర్తలకు ఏదైనా సమస్య వస్తే ఫోన్ చేయాలని వారందరికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కేసీఆర్ (KCR) ఒక్కడిగా బయలుదేరి దిల్లీని కదిలించి తెలంగాణను సాధించారని తెలిపారు.