KTR Tweet on Power Cuts in Telangana : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దురదృష్టవశాత్తు తెలంగాణలో మళ్లీ చీకట్లు మొదలయ్యాయని, కరెంటు కోతలు నిత్య కృత్యమయ్యాయని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. విద్యుత్ కోతలే లేకుండా విద్యుత్ రంగంలో బీఆర్ఎస్ సృష్టించిన మౌలిక సదుపాయాలను కూడా వాడుకోలేని అసమర్థ స్థితిలో రేవంత్ రెడ్డి సర్కార్ ఉందని ధ్వజమెత్తారు. ఈ మేరకు రాష్ట్రంలో విద్యుత్ కోతలపై ఎక్స్ వేదిక కేటీఆర్ ట్వీట్ చేశారు. పలువురు నెటిజన్ల పోస్టింగులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ట్యాగ్ చేస్తూ నెటిజన్ల ట్వీట్లను రీట్వీట్ చేశారు.
"2014తు ముందు తరుచు విద్యుత్ కోతలు, పవర్ హాలీడేస్ మనకు తెలిసిందే. ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేసిన ఘనత కేసీఆర్ సర్కార్ది. 24 గంటల నాణ్యమైన కరెంటు సరఫరా చేయటం కారణంగా హైదరాబాద్ అభివృద్ధిలో దూసుకుపోయే పరిస్థితి వచ్చింది. పనికి మాలిన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ పదేళ్ల క్రితం నాటి పాత రోజులను తిరిగి తీసుకొచ్చింది. తరుచూ విద్యుత్ కోతలతో అటు ప్రజలకు, ఇటు పరిశ్రమలకు ఇబ్బంది తీసుకొస్తోంది. విద్యుత్ కోతలు లేకుండా కేసీఆర్ చేసిందేమిటని కొంతమంది అడుగుతున్నారని" ఎక్స్ వేదికగా కేటీఆర్ అన్నారు.
విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసింది కేసీఆర్నే : 1,110 యూనిట్లుగా ఉన్న తలసరి వినియోగం 2,110 యూనిట్లకు చేరిందని కేటీఆర్ తెలిపారు. సౌర విద్యుత్ సామర్థ్యం 71 మెగావాట్ల నుంచి 5,000 పైగా మెగావాట్లకు పెంచామన్నారు. తెలంగాణలో స్థాపిత విద్యుత్ సామర్థ్యం 7,778 మెగావాట్ల నుంచి 18,000 మెగావాట్లకు చేరిందని స్పష్టం చేశారు. యాదాద్రి ప్లాంటు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే 25 వేల మెగావాట్లకు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.