BRS Chief KCR Fires On Congress Govt : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోందని, అంతలోనే ఏం కోల్పోయారో తెలంగాణ ప్రజలకు తెలిసొచ్చిందని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. మళ్లీ గులాబీ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రజలు చెబుతున్నారని తెలిపారు. సిద్దిపేటలో పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నేతలతో కేసీఆర్ ఇవాళ సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో సినీ నిర్మాత శ్రీనివాస్‌రెడ్డిని గులాబీదళంలోకి ఆహ్వానించిన కేసీఆర్, మళ్లీ గులాబీ దళమే తెలంగాణలో అధికారానికి వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ,, గులాబీ నేతలు హైరానా పడాల్సిన అవసరం లేదన్నారు. సమాజాన్ని నిలబెట్టి, నిర్మాణం చేయాల్సిన రాష్ట్ర సర్కార్, కూలగొడతామని పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతోందని మండిపడ్డారు. ప్రజలు బాధ్యత ఇస్తే, అంతే బరువుతో సేవ చేయాలని అన్నారు. గతంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకంటే 90 శాతం ఎక్కువే చేశామని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.
"ప్రతి జిల్లా, మండలం నుంచి 100 శాతం మన ప్రభుత్వమే వస్తుందని ప్రజలు చెప్తున్నారు. సమాజాన్ని నిలబెట్టి, నిర్మాణం చేయాలి. మనిషిని పైకి తేవాలి కానీ కూలగొడ్తం, అది చేస్తాం, ఇది చేస్తామని పిచ్చి పిచ్చి మాటలు ప్రభుత్వం మాట్లాడే మాటలేనా? మాకు రావా మాటలు. ఇవాళ మొదలు పెడితే రేపటి వరకు మాట్లాడతాను. ఒక బాధ్యతను ప్రజలు మీకు అప్పగిస్తే దాన్ని తీసుకొని అంతే బరువుతో ప్రజలకు సేవ చేయాలి. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన మాటలకంటే 90 శాతం మేము ఎక్కువే చేశాం."- కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత