BRS Approached Supreme Court on Party Changed MLAs : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 10 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసి 9 నెలలవుతున్నా స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని పిటిషన్‌లో పేర్కొంది. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్‌కు వ్యతిరేకంగా ఎస్‌ఎల్‌పీ దాఖలు చేయగా, మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా రిట్ పిటిషన్‌ను దాఖలు చేశారు.
హైకోర్టు తీర్పు ఇచ్చి 6 నెలలైనా ఇప్పటికీ స్పీకర్ చర్యలకు ఉపక్రమించలేదని బీఆర్ఎస్ తెలిపింది. కనీసం నోటీసు కూడా ఇవ్వలేదని పిటిషన్‌లో పేర్కొంది. గతంలో కేశం మేఘా చంద్ర కేసులో ఇచ్చిన తీర్పు అమలుచేయాలని కోరింది. పార్టీల ఫిర్యాదులపై స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం చెప్పాలని కేశం మేఘా చంద్ర కేసులో తీర్పు రాగా మేఘా అందుకు అనుగుణంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవట్లేదని ఆరోపించింది. 4 వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది.
తగిన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి - ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు తీర్పు
బీఆర్ఎస్ తరఫున గెలిచిన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర అధికార పార్టీ కాంగ్రెస్‌లో చేరారు. వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కే.పీ. వివేకానంద్‌లు పిటిషన్లు దాఖలు చేశారు. ఎమ్మెల్యేలపై వచ్చిన ఫిర్యాదులను స్పీకర్ ముందుంచాలని, విచారణ తేదీలు నిర్ణయించి 4 వారాల్లో రిజిస్ట్రీకి సమాచారం ఇవ్వాలని సింగిల్ బెంచ్ సెప్టెంబర్ 9న తీర్పు ఇచ్చింది.
ఆ తీర్పును కొట్టేసిన తెలంగాణ హైకోర్టు :సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి సీజే ధర్మాసనంలో అప్పీలు దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ ఆలోక్ అరాధె, జస్టిస్ జె.శ్రీనివాస్ రావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కేసుపై తీర్పు ఇచ్చిన ఉన్నత న్యాయస్థానం పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని సూచించింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం, 10వ షెడ్యూల్, అసెంబ్లీ 5 ఏళ్ల గడువును దృష్టిలో ఉంచుకొని స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సీజే ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది.
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు - సింగిల్ బెంచ్ తీర్పును అప్పీల్ చేసిన అసెంబ్లీ కార్యదర్శి - HC ON MLA Disqualification Petition