Brother Killed Sister for Insurance Money:ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సొంత చెల్లిని పథకం ప్రకారం హత్య చేసిన కేసును ప్రకాశం జిల్లా పొదిలి పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. కనిగిరి మండలం పునుగోడుకు చెందిన మాలపాటి అశోక్ కుమార్ వ్యాపారాలు చేసి అప్పుల్లో కూరుకుపోయాడు. ఈ నేపథ్యంలో చెల్లి సంధ్య భర్తతో విడిపోయి తండ్రి వద్దే ఉంటుంది. దీంతో అప్పు తీర్చుకునేందుకు సంధ్య పేరుపై సుమారు కోటి రూపాయలకు ఇన్సూరెన్స్ కట్టాడు.
ఆమెను గత ఏడాది ఫిబ్రవరి నెలలో హత్య చేసి పొదిలి వద్ద కారుతో చెట్టును ఢీకొట్టి యాక్సిడెంట్‌గా చిత్రీకరించాడు. ఆమె మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో విషయం బయటపడింది. నిందితున్ని అరెస్టు చేసినట్లు పొదిలి సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఈ కేసుకి సంబంధించిన వివరాలు వెల్లడించారు.
ఈ కేసుని విచారిస్తున్నప్పుడు, ఊపిరాడకుండా చనిపోయినట్లు తెలిసిందని అన్నారు. దర్యాప్తులో మరిన్ని విషయాలు బయటకు వచ్చాయని తెలిపారు. కూలి పనులు చేస్తూ జీవించే సంధ్య పేరుమీద కోటి 13 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చేసి ఉందని పేర్కొన్నారు. దీనిపై ముద్దాయిని అదుపులోకి తీసుకుని విచారించగా, అతడు నేరాన్ని అంగీకరించినట్లు చెప్పారు.