Brother And Sister in Wushu Martial Art : చూస్తున్నారుగా! ఆయుధాలు పట్టుకుని యుద్ధ విద్యలో ఎలా సాహసాలు చేస్తున్నారో! తండ్రిని స్ఫూర్తిగా తీసుకుని క్రీడల్లోకి వచ్చారు. ఆయన మార్గంలోనే పయనించి అంతర్జాతీయ యవనికపై సత్తా చాటేందుకు నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా శిక్షణ పొందుతూ ఆరితేరుతున్నారు. ప్రపంచస్థాయి వుషూ క్రీడలో పసిడి పతకాలు పట్టుకొస్తూ ప్రశంసలందుకుంటున్నారు ఈ యువ క్రీడాకారులు.
Brother And Sister in Wushu Martial Art at Khammam :యుద్ధ విద్యలో (Martial Art) పోటీ పడుతున్న వీరిద్దరు అన్నాచెల్లెళ్లు. పేర్లు సత్యజిత్ చారి, పవిత్రాచారి. వీరిది ఖమ్మం స్వస్థలం. వీరి తండ్రి పరిపూర్ణా చారి వుషూ కోచ్. జిల్లాలో కోచ్‌గా దశాబ్దాలుగా వందలాది మంది విద్యార్థులకు వుషూ క్రీడలో తర్ఫీదునిస్తున్నాడు. మైదానంలో శిక్షణ ఇస్తున్న తండ్రినే స్ఫూర్తిగా తీసుకుని ఆ క్రీడపై మక్కువ పెంచుకున్నారు. ఐదేళ్ల వయసులో సత్యజిత్, నాలుగేళ్ల వయసులో పవిత్ర ఇద్దరూ వుషూ క్రీడలో తండ్రి వద్దే శిక్షణ ప్రారంభించారు.
భారత్‌లోనే యంగెస్ట్ స్టూడెంట్ పైలట్‌గా హైదరాబాద్ కుర్రాడు - 16 ఏళ్లకే ఎలా అయ్యాడో తెలుసా?
ఇంతింతై వటుడింతై అన్నట్లు మార్షల్ ఆర్ట్స్‌లో సత్తాచాటుతున్నారు ఈ అన్నాచెల్లెళ్లు. రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించి జాతీయ స్థాయిలో ఇప్పటికే తనదైన ముద్రవేసింది పవిత్ర చారి. ఖేలో ఇండియా, ఎస్‌జీఎఫ్ లాంటి 16 జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంది. ఇటీవల గోవాలో జరిగిన 36వ జాతీయ క్రీడల్లో తెలంగాణ నుంచి ప్రాతినిథ్యం వహించింది. 2023లో చైనాలో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో కాంస్య పతకం గెలుచుకుంది.
"నేను ఐదేళ్ల వయస్సు నుంచి నుంచి వుషూ నేర్చుకున్నాను. మా నాన్న వుషూ కోచ్ ఆయన దగ్గర ఈ విద్య నేర్చుకున్నాను. ఎస్‌జీఎఫ్ లాంటి 16 జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నాను. ఇటీవల గోవాలో జరిగిన 36వ జాతీయ క్రీడల్లో తెలంగాణ నుంచి ప్రాతినిథ్యం వహించాను. 2023లో చైనాలో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో కాంస్య పతకం గెలుచుకున్నాను." - పొడికంటి పవిత్రాచారి, వుషూ క్రీడాకారిణి
Showing Special Skills in Wushu Martial Art : పవిత్ర చారి సోదరుడు సత్యజిత్ కూడా వుషూలో రాణిస్తూ తనదైన ముద్ర వేస్తున్నాడు. ఇప్పటి వరకు 70 జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. ఇందులో 15 స్వర్ణ, 3 రజత, ఒక కాంస్య పతకం గెలుచుకున్నాడు. రెండేళ్ల క్రితం అంతర్జాతీయ స్థాయి వుషూ పోటీల్లోనూ అడుగుపెట్టాడు. యూరప్‌లో జరిగిన అంతర్జాతీయ వుషూ పోటీల్లో 2 రజతాలు గెలుచుకున్నాడు. గతేడాది లిథువేనియాలో 3 బంగారు పతకాలు సాధించాడు.