Brindasri From Miryalaguda Gets Nobel World Record in Chess :మూడున్నరేళ్ల పసి ప్రాయం నుంచి చదరంగం సాధన చేస్తూ ఆన్లైన్లో ట్రైనింగ్ తీసుకుంటూ కేవలం 1.49 నిముషాల వ్యవధిలోనే 50 చెక్మెట్లను పెట్టి నోబెల్ ప్రపంచ రికార్డు సాధించిన బ్రిందశ్రీపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. మిర్యాలగూడ పట్టణానికి చెందిన బ్రిందశ్రీ ఈ రికార్డు సాధించగా చిన్నారి ప్రతిభను అంతా మెచ్చుకుంటున్నారు.
న్యూజీలాండ్లోని ఆక్ల్యాండ్లో నివాసం ఉంటున్న ఐత పృధ్వీరాజ్, కావ్య దంపతులకు కుమార్తె బ్రిందశ్రీ మూడో తరగతి చదువుతుంది. సొంత పిన్ని అంతర్జాతీయ చదరంగ క్రీడాకారిణి మాశెట్టి దివ్యశ్రీ. బ్రిందశ్రీ మూడో ఏడు నుంచి పిన్ని దగ్గర శిక్షణ ప్రారంభించింది. మొదటి సారిగా 2023లో హైదరాబాద్లో నిర్వహించిన పోటీల్లో పాల్గొని రెండో స్థానంలో నిలిచింది. తాజాగా నోబెల్ వరల్డ్ రికార్డు సంస్థ వారి నుంచి ముందస్తు అనుమతి పొంది ఈ నెల 6న మిర్యాలగూడలో అంతర్జాతీయ క్రీడాకారుడు అరవింద్ సమక్షంలో పోటీలో పాల్గొంది. ఆన్లైన్లో నోబెల్ సంస్థ ప్రతినిధులు చూస్తున్న సమయంలో 2నిమిషాల వ్యవధికి గాను 1.46 నిముషాల్లోనే 50 చెక్మెట్లు పెట్టి అందరిని అబ్బుర పరచింది.