Brief Explanation on Pitru Devatas and Amavasya Relation :పితృ దేవతల్ని శ్రాద్ధకర్మాదులతో అర్చించాలని చెప్పే సందర్భాలు పురాణాల్లో చాలా ఉన్నాయి. అసలు పితృదేవతలు ఎవరనే సందేహానికి, ప్రశ్నలకు సమాధానమిస్తుంది ఈ కథ సందర్భం. ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య అన్నా పితృదేవతలకు ఎంతో ఇష్టమని ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. మరి పితృదేవతలకూ, ఈ అమావాస్యకూ ఉన్న సంబంధం ఏమిటి? పితృదేవ గణాలు ఎన్ని, అవి ఎలా ఉంటాయి? అసలు అమావాస్య ఎలా ఉద్భవించింది? ఈ విషయాల్ని చెప్పే కథాంశం మత్స్యపురాణం పద్నాలుగో అధ్యాయంలో కనిపిస్తుంది.
పితృదేవతలు ఏడు గణాలుగా ఉంటారు. వీరిలో మూడు గణాల వారికి ఆకారం ఉండదు. వైరాజులు, అగ్నిష్వాత్తులు, బర్హిషదులు అనే వారికి ఆకారం ఉండకపోవడం విశేషం. హవిష్మంతులు, సుఖాలినులు, సోమపులు, ఆజ్యవులు అనే నాలుగు గుణాలకు ఆకారం ఉంటుంది. ఈ ఏడు గుణాల వారూ ప్రాణులందరిలో అమితమైన సామర్థ్యాన్ని, చైతన్యాన్ని కలిగిస్తుంటారు. అందుకే పితృదేవతలకు కావాల్సిన శ్రాద్ధ విధుల్ని నిర్వహించాలని అంటుంటారు. మూర్తి (ఆకారం) లేని పితరులు వైరాజుడు అనే ప్రజాపతి కుమారులు. వీరిని వైరాజులు అని అంటారు. ఈ పితృదేవతలు ద్యులోకంలో ఉంటారట.
పితృదేవతలుగా ఎలా మారారంటే? :పితృగణాల వారు శాశ్వతాలైన లోకాల్ని పొందగోరి ఓసారి యోగసాధనకు ఉపక్రమించారు. ఏకాగ్రత లోపించడంతో యోగభ్రష్టులయ్యారు. భ్రష్టులైన కారణంగా వారంతా పితృదేవతలుగా మారారు. ఈ పితృదేవతల మానసపుత్రికే మేన. ఆమె హిమవంతుడిని పెళ్లి చేసుకుంది. వీరికి మైనాకుడు అనే కుమారుడు జన్మించాడు. మైనాకుడికి క్రౌంచుడు జన్మించాడు. మైనాకుడి కుమారుడు క్రౌంచుడు పేరు మీదనే క్రౌంచ ద్వీపం ఏర్పడింది.