Bridges Washed Away by Heavy Rains : రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లోని బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. మహబూబాబాద్ జిల్లాలో కురిసిన కుంభవృష్టికి అపార నష్టం జరిగింది. ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి వాగులు పొంగి పొర్లాయి. ములకలపల్లి-ఖమ్మం జిల్లా సరిహద్దులోని ఆకేరు వాగుపై ఉన్న బ్రిడ్జి కొట్టుకుపోయింది. దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ వంతెన ద్వారా ఖమ్మం-మహబూబాబాద్ జిల్లాల మధ్య రాకపోకలు కొనసాగేవి. వంతెన కొట్టుకుపోవడంతో ఈరెండు జిల్లాల మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి.
వంతెన కొట్టుకుపోవడంతో రెండు రోజుల నుంచి వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు చిన్నగూడూరు మండల కేంద్రం శివారులో ఆకేరు వాగు వరద నీటికి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో బ్రిడ్జి వద్ద ఉన్న బీటీ రోడ్డు కోతకు గురైంది. దీంతో మహబూబాబాద్ మరిపెడ మండలానికి రాకపోకలు నిలిచిపోయాయి.
కూలిన మేళ్ల చెరువు బ్రిడ్జి : సూర్యాపేట జిల్లాలో మేళ్ల చెరువు మండలం కందిబండ వద్ద ప్రధాన రహదారిపై ఉన్న బ్రిడ్జి కూలిపోయింది. చెరువుకు గండి పడి వరద నీరు పెరగడంతో బ్రిడ్జి కూలగా పోలీసు యంత్రాంగం అప్రమత్తం అయింది. వరద తాకిడి పెరిగి బ్రిడ్జి మీద నుంచి నీళ్లు రావడంతో పాత బ్రిడ్జి కావడం వల్ల బ్రిడ్జి కూలిపోయిందని స్థానికులు చెబుతున్నారు. దీంతో మేళ్లచెరువు నుంచి కోదాడ వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది.