Man Killed His Girlfriend :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం మాచినేనిపేట తండాలో దారుణం చోటుచేసుకుంది. స్వాతి అనే యువతి దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. ఆమె ప్రియుడు వీరభద్రం యువతిని అతి క్రూరంగా చంపి గ్రామ సమీపంలోని పత్తి పొలంలో పాతిపెట్టాడు. ఈ ఘటన జరిగి మూడు రోజులైన తర్వాత ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ జరిగింది :మణుగూరు మండలం తోగ్గుడేనికి చెందిన స్వాతి(32) అనే యువతి ఆరేళ్లుగా వీరభద్రంతో సహజీవనం చేస్తూ మాచినేనిపేట తండాలోనే ఉంటోంది. భద్రం భార్యతో పాటు స్వాతి కూడా ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. కుటుంబ తగాదాలు, ఆర్థిక విషయాల్లో లావాదేవీలతోపాటు పలు కేసుల్లో భద్రం నిందితుడిగా ఉన్నాడు. కొంతకాలంగా భద్రం, స్వాతిల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రియురాలి అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న భద్రం ఈనెల 9న తన ఇంట్లోనే స్వాతిని దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని సమీపంలో ఉన్న తన పత్తి పొలంలో పాతిపెట్టాడు.
దీనిపై సమాచారమందుకున్న కొత్తగూడెం డీఎస్పీ, జూలూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్సై రాణా ప్రతాప్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. రెవెన్యూ, పోలీస్ అధికారులు మృతదేహాన్ని వెలికి తీసేందుకు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో స్థానికంగా ఒక్కసారిగా కలకలం రేగింది. కేసును చేధించేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.