Boy Suffering from Necrotizing Fasciitis Disease :అత్యంత అరుదుగా వచ్చే 'నెక్రోటైజింగ్ ఫాసియైటిస్ వ్యాధితో 12 ఏళ్ల భవదీప్ బాధపడుతుండటంతో ఆ చిన్నారి కుటుంబం తల్లడిల్లిపోతోంది. సాధారణంగా మధుమేహ రోగుల్లో ఎక్కువగా కనిపించే ఈ వ్యాధి చిన్నపిల్లల్లోనూ కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. శరీరంపై ఎటువంటి గాయాలు లేకుండానే భవదీప్ శరీరంలోకి ప్రమాదకరమైన బ్యాక్టీరియా ప్రవేశించడం వైద్యులనూ విస్మయానికి గురిచేస్తోంది. భవదీప్ శరీరంలోకి ప్రమాదకర బ్యాక్టీరియా చొచ్చుకుపోయి తినేయడం వల్ల కుడి కాలును తొడ భాగం వరకు తొలగించారు. ఎడమ మోకాలి కింద భాగంలో ముప్పై శాతం మేర కండను కూడా సూక్ష్మక్రిములు తినేశాయి. నెక్రోటైజింగ్ ఫాసియైటిస్ జబ్బుకు మరో పేరు ఫ్లెష్ ఈటింగ్ డిసీజ్. విజయవాడలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న భవదీప్‌కు అందించే వైద్యానికి అవసరమైన ఖర్చు కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షలు మంజూరు చేసింది.
కుడి కాలును తొడ వరకు తొలగింపు :ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన భవదీప్ కుటుంబం ఉండే ఇంట్లోకి ఈ నెల తొలి వారంలో వరద నీరు వచ్చింది. మరుసటి రోజు నీరు తగ్గే వరకు ఆ బాలుడు నీటిలోనే ఉన్నాడు. చిన్నచిన్న పనులు కూడా చేశాడు. అదే రోజు రాత్రి నుంచి వణుకు, చలి, జ్వరం వచ్చింది. స్థానికంగా చికిత్స చేయించుకున్నాడు. అయినా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. డెంగీ బారినపడినట్లు గుర్తించారు. తొడల నుంచి అరికాళ్ల వరకు వాపులు వచ్చాయి. దీంతో విజయవాడలోని కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్పించారు. కాళ్ల కండరాలను సూక్ష్మక్రిములు తినేశాయని వైద్యులు గుర్తించారు. ఈ నెల 17న శస్త్ర చికిత్స చేసి కుడి కాలును తొడ వరకు తొలగించారు.