Bonalu Festival Begins Today in Telangana : ఆషాఢమాసం వచ్చేసింది. బోనాల సందడి షురూ కానుంది. డప్పు చప్పుళ్లు, తీన్మార్ దరువులతో నగరం మారుమోగనుంది. పోతురాజుల వీరంగాలు, శివసత్తుల పూనకాలతో భాగ్యనగరం సరికొత్త శోభను సంతరించుకోనుంది. ఇవాళ్టి నుంచి ఆగస్టు 4 వరకు బోనాల ఉత్సవాలు సాగనున్నాయి.
ఆషాఢమాసంలో వచ్చే తొలి గురు లేదా ఆదివారాల్లో బోనాల వేడుకలు ప్రారంభమవుతాయి. ఆ ఆనవాయితీ ప్రకారం తొలి ఆదివారమైన ఇవాళ ఉత్సవాలకు అంకుర్పారణ జరగనుంది. గోల్కొండలోని జగదాంబిక, మహంకాళీ అమ్మవార్లు తొలి బోనం అందుకుంటారు. దశాబ్ది బోనాల వేడుకల పేరుతో ఈసారి ప్రభుత్వం బోనాల జాతరను మరింత శోభాయమానంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. 20 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది.
గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ఇవాళ్టి నుంచి ఆషాఢమాసం మొత్తం గురు, ఆదివారాల్లో బోనాలు సమర్పిస్తారు. ప్రత్యేక పూజలు చేస్తారు. ఇవాళ తొలి పూజ కావడంతో ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. లంగర్‌హౌస్ నుంచి ఊరేగింపుగా వెళ్లి చోట బజార్‌లోని పూజారి ఇంట్లో ఉన్న అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం బంజారా దర్వాజ వైపు నుంచి నజర్ బోనం తీసుకుని, అమ్మవారి ఊరేగింపు గోల్కొండ కోటకు చేరుకుంటుంది. ఆలయంలో అమ్మవారి ఘటాలను ఉంచిన తరువాత భక్తులు బోనాలు సమర్పిస్తారు.