Bomb Threat Call to Shamshbad Airport : హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 6 విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చిన ఘటన కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది విమానాశ్రయంలో క్షుణ్నంగా తనిఖీలు నిర్వహించారు. దేశంలోని వివిధ విమానయాన సంస్థలు నడుపుతున్న 100కు పైగా విమానాలకు మంగళవారం బాంబు బెదిరింపులు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో కేవలం 16 రోజుల వ్యవధిలో 510కు పైగా దేశీయ, అంతర్జాతీయ విమానయాన సర్వీసులకు బెదిరింపులు వచ్చినట్లైంది. మంగళవారం (అక్టోబర్ 29) ఒక్క రోజే 70కి పైగా బెదిరింపు కాల్స్ రావడం గమనార్హం.
మరోవైపు విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్న నేపథ్యంలో ఈ కుట్ర వెనకాల ఓ పుస్తక రచయిత ఉన్నట్లు మహారాష్ట్ర పోలీసులు గుర్తించారు. మహారాష్ట్రలోని గోండియాకు చెందిన జగదీశ్ ఉయికే అని నాగ్‌పుర్ పోలీసులు తెలిపారు. గతంలో ఉగ్రవాదంపై పుస్తకం రచించిన ఈ జగదీశ్, 2021లో ఓ కేసులో అరెస్టయినట్లు వెల్లడించారు. ఈ వ్యక్తి ఈ-మెయిల్ ద్వారా పలు పెద్ద పెద్ద విమానయాన సంస్థలకు నకిలీ బాంబు బెదిరింపు సందేశాలు పంపించాడని, దీని కారణంగా పలు విమానాలు ఆలస్యంగా నడిచినట్లు పోలీసులు వెల్లడించారు.
చట్టంలో సవరణ : ఇలాంటి చర్యలపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇటీవల స్పందించిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ చర్యల వెనక ఎవరు ఉన్నా, కఠిన శిక్ష పడుతుందని హెచ్చరించారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఇక నుంచి ఏవియేషన్ చట్టాల్లో కీలక సవరణలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఫేక్ కాల్స్ చేసిన వారిని విమానాలలో ప్రయాణానికి అనుమతించబోమని వెల్లడించారు.