Boat Races And Swimming Competitions Held In Atreyapuram :పర్యాటక రంగానికి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం కోనసీమలో సంక్రాంతి సంబరాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పేరుతో డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో కేరళ తరహాలో పడవ పోటీలను ఏర్పాటు చేసింది. ఈ పోటీలకు పలు జిల్లాల నుంచి 180 మంది క్రీడాకారులతో కూడిన 11 జట్లు హాజరయ్యాయి.
బొబ్బర్లంక ప్రధాన కాలువలో ఉచ్చిలి నుంచి ఆత్రేయపురం వరకు వెయ్యి మీటర్ల పరిధిలో యువకులకు డ్రాగన్ బోట్ రేస్, యువతులకు కనోయింగ్ బోటింగ్ పోటీలు ఆదివారం ఉత్సాహంగా సాగాయి. ఒక్కో పడవలో 12 మంది క్రీడాకారులు చొప్పున పాల్గొన్నారు. ఈ పోటీలను రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, కొత్తపేట, రాజోలు, ఉంగుటూరు ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు, దేవవరప్రసాద్, పత్సమట్ల ధర్మరాజు ప్రారంభించారు.
డ్రాగన్ పడవల పోటీల్లో జంగారెడ్డిగూడెం జెయింట్, పల్నాడు థండర్స్, ఎన్టీఆర్ ఈగల్స్, కోటిపల్లి చీతాస్, పల్నాడు పాంథర్స్, కృష్ణా లయన్స్ జట్లు సైమీ ఫైనల్స్‌కు ఎంపికయ్యాయి. సోమవారం ఈత, డ్రాగన్ పడవ పోటీలకు సంబంధించి 100 మీటర్ల సెమీ ఫైనల్స్, ఫైనల్స్ జరుగుతున్నాయి. పోటీలను తిలకించేందుకు జనం భారీగా తరలివచ్చారు. ప్రకృతి అందాలకు నిలువైన కోనసీమలో సంక్రాంతి సంబరాల ఎంతో వైభవంగా ప్రారంభమయ్యాయి.