తెలంగాణ

telangana

ETV Bharat / state

కుళ్లిపోయిన కుమారుడి శవం పక్కనే నిస్సహాయస్థితిలో అంధ వృద్ధ దంపతులు - BLIND SON DEATH

మద్యం తాగి కుమారుడి మరణం - తల్లిదండ్రులు అంధులు కావడంతో మూడు రోజులుగా ఇంట్లోనే మృతదేహం

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 29, 2024, 12:51 PM IST

Updated : Oct 29, 2024, 1:18 PM IST

Blind Son Death In Nagole: ఆ వృద్ధ దంపతులిద్దరూ అంధులే. అసలే వయోభారం. మరోవైపు చిన్న కుమారుడి పరిస్థితి బాధాకరం. అంతలోనే ఆ కుమారుని మరణం. కానీ తమ కుమారుడు చనిపోయాడని తెలుసుకోలేని దైన్యం ఆ తల్లిదండ్రులది. మూడు రోజులు కుమారుడి శవం పక్కనే ఉన్నా, తమ బిడ్డ విగతజీవయ్యాడని గ్రహించలేని తల్లిదండ్రుల బాధ కడు శోచనీయం. ఇంత దయనీయ ఘటన హైదరాబాద్​లోని నాగోల్​లో చోటు చేసుకుంది. నాగోల్ డివిజన్ పరిధిలోని జైపురి కాలనీలో నివాసం ఉండే రమణ, శాంతకుమారి అనే వృద్ధ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ప్రదీప్ తన కుటుంబ సభ్యులతో కలిసి వేరే చోట ఉంటున్నాడు.

చిన్న కుమారుడు ప్రమోద్​కు పెళ్లైన తర్వాత భార్య విడిచి గత నాలుగేళ్లుగా దూరంగా ఉంటుంది. తల్లిదండ్రుల నివాసంలోనే ఉంటున్న కుమారుడు మద్యం సేవించి ఇంటికి వచ్చి నిద్రలోనే మరణించాడు. కానీ తల్లిదండ్రులకు ప్రమోద్ మరణించిన సంగతి తెలియదు. అంధులు కావడంతో ఇద్దరికీ కనిపించదు. అలా కుమారుడు ఎటు వెళ్లాడో తెలియక ఆ వృద్ధ దంపతులు మూడురోజుల పాటు మృతదేహం పక్కనే గడిపారు. ఆ సమయంలో అటు వైపుగా స్థానికులు కూడా రాకపోవడంతో ప్రమోద్ చనిపోయిన విషయం ఎవరికీ తెలియలేదు.

Blind Son Death In Nagole (ETV Bharat)

మూడు రోజుల తర్వాత శరీరం కుళ్లిపోయి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు అప్పుడు నాగోల్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల ఘటనా స్థలానికి చేరుకోగానే, సీఐ సూర్యనాయక్ మనసు ద్రవించింది. కుమారుడి శవం పక్కన ఏమీ తెలియకుండా బిక్కుబిక్కుమంటున్న వృద్ధులకు ఆయన దిక్కయ్యాడు. వారి నుంచి ప్రదీప్ నెంబర్ తీసుకుని, విషయాన్ని చేరవేశారు. వృద్ధులకు సపర్యలు చేసి ఆహారం అందించారు.

Blind Son Death In Nagole (ETV Bharat)

3 రోజులుగా కుమారుడి మరణం గురించి తెలియక వారి వైకల్యం వల్ల అమాయకంగా ఉన్న ఆ దంపతుల ముఖాలు స్థానికుల హృదయాలతో పాటు పోలీసుల హృదయాలనూ కలచివేశాయి. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. బిడ్డకు చిన్న గాయమైతేనే తల్లిపేగు తల్లడిల్లిపోతుంది. అలాంటిది తమ బిడ్డ చనిపోయాడని తెలియక 3 రోజులు మృతదేహంతో సహవాసం చేసిన ఆ వృద్ధ జంటకు కుమారుడు తిరిగి రాని లోకాలకు వెళ్లాడని తెలిసిన క్షణం గుండె చెరువైంది. కష్టానికి పరాకాష్ఠగా మారిన ఘటన నగరవాసులతో పాటు అందరి హృదయాల్ని కదిలించింది.

తండ్రి మరణం, కుమారుడి జననం - గద్వాల జిల్లాలో హృదయాన్ని మెలిపెట్టే విషాదం

మీ టార్చర్ వల్లే మా పాప సూసైడ్ చేసుకుంది - బాచుపల్లి కాలేజీపై తల్లిదండ్రుల ఆగ్రహం

Last Updated : Oct 29, 2024, 1:18 PM IST

ABOUT THE AUTHOR

...view details