BJP Lanka Dinakar Comments on CM Jagan: విద్యుత్తు ప్రాజెక్టుల పేరుతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భారీ భూదోపిడీకి పాల్పడ్డారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం కావడంతో మరిన్ని అక్రమాలకు తెరతీస్తూ, తమ అస్మదీయులకు భూమిని కట్టబెట్టే విధంగా చీకటి జీవోలు జారీ చేశారంటూ దుయ్యబట్టారు. ఇండోసోల్ కంపెనీని జగన్ తన ఆత్మగా పరిగణిస్తూ వస్తున్నారని, అలాగే యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రాజెక్టుతో అపరిమిత సంబంధాలను కొనసాగిస్తున్నారని ఆరోపించారు.
ఏపీ భూ హక్కుల చట్టం అడ్డంపెట్టుకుని అటవీ, ప్రభుత్వ, ప్రైవేటు భూములను కాజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. 774.90 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చేసుకున్న పీపీఏ (Power Purchase Agreement) ప్రతిపాదనలను విద్యుత్తు నియంత్రణ మండలి తిరస్కరించడాన్ని తాము ఆహ్వానిస్తున్నామన్నారు. దీనివల్ల రాష్ట్రానికి 7 వేల 300 కోట్ల రూపాయల మేర నష్ట నివారణ జరిగినట్లు ERC (Electricity Regulatory Commission) పేర్కొందన్నారు.
ప్రజలు బాగా ఆలోచించి మంచి నాయకుడిని ఎన్నుకోవాలి: లంకా దినకర్ - Lanka Dinakar on jagan corruption
నిబంధనలను అమలు చేయకుండా, యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తీసుకున్న మొత్తం నాలుగు వేల మెగావాట్ల ప్రాజెక్టులు రద్దు చేస్తే, రాష్ట్రానికి 40 వేల కోట్ల రూపాయల నష్ట నివారణ జరుగుతుందని అభిప్రాయపడ్డారు. యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, జగన్ ప్రభుత్వం నిబంధనలకు పాతర వేసిందని పేర్కొన్నారు. ఇంతవరకు ఒక్క అడుగు కూడా ఈ విద్యుత్తు ప్రాజెక్టులు ముందుకు జరగకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం వేల ఎకరాల ప్రభుత్వ, ప్రైవేట్, ఇతర భూములను ఎందుకు కేటాయిస్తోందని ప్రశ్నించారు.
ఆగమేఘాల మీద ఎన్నికల ముందు ఈ ఏడాది ఫిబ్రవరి 6వ తేదీన ఇచ్చిన జీఓ నెంబర్ 19 అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ కోసం 2.50 లక్షల ఎకరాల రెవెన్యూ, అటవీ, ప్రైవేట్ భూమి అవసరమన్న కంపెనీ ప్రతిపాదనకు జీఓ నెం 19/2024 నాంది పలికిందన్నారు. నంద్యాల, కర్నూల్, అనంతపురం, కడప జిల్లాల్లో భూములు అన్యాక్రాంతానికి ఈ చీకటి జీఓని విడుదల చేశారని లంకా దినకర్ ఆరోపించారు.
3 వేల 500 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును చూపుతూ, మొదటి దశలో 21 వేల ఎకరాలతో పాటు అదనపు భూమిని ఇండోసోల్‌కు సీఎం జగన్ ముందు సమకూర్చడం చిదంబర రహస్యంగా ఉందన్నారు. ఇదే కాకుండా 2 వేల 200 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టు, 1500 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుల పేరుతో మరో 30 నుంచి 40 వేల ఎకరాల భూమి కోసం ప్రయత్నం చేయటం బయటపడిందన్నారు. ఈ భూములు లీజ్ ధర ఎకరాకి 31 వేల రూపాయిలు అని, కొనుగోలు చేస్తే 5 లక్షల రూపాయలుగా ఉందని ప్రభుత్వం చెబుతోందని, అయితే భూమి బదలాయింపు ధరలు "కాంపిటెంట్ అథారిటీ " ద్వారా నిర్ణయం తీసుకుంటామనే చెప్పటం చూస్తుంటే, భూములను కొట్టేయాలనే పన్నాగం కనిపిస్తోందని లంకా దినకర్ అన్నారు.
సుప్రీం తీర్పులకు భిన్నంగా సహజ వనరులను జగన్ కట్టబెడుతున్నారు: లంకా దినకర్ - Lanka Dinakar on CM Jagan