Biker Attack On Old Man : అతివేగం అనర్థదాయకం - ఈ మాట అందరూ తరచూ చెప్పేదే. రోడ్లపై రాష్ డ్రైవింగ్ చేస్తూ వెళ్లే వాహనదారులకు పోలీసులు తరచూ చెప్పే మాటే ఇది. ఇంట్లో పెద్దలు కూడా తమ పిల్లలకు బైక్స్, కార్లలో వెళ్లేటప్పుడు నెమ్మదిగా వెళ్లమని సూచిస్తుంటారు. కొందరు బైకర్ల రాష్ డ్రైవింగ్ రోడ్డుపై వెళ్లే వారి పాలిట ప్రాణాంతకం అవుతుంటుంది. ఇలాంటి ఘటనలు రోజూ చాలానే జరుగుతుంటాయి. అయితే హైదరాబాద్ నగర పరిధిలోని అల్వాల్లో జరిగిన ఘటన కాస్త భిన్నం.
స్లోగా వెళ్లాలని చెప్పినందుకు వృద్ధుడిపై దాడి :గత నెల సెప్టెంబర్ 30న అల్వాల్ పీఎస్ పరిధిలో రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి ఆంజనేయులు రోడ్డు దాటుతున్నారు. ఆ సమయంలో బైక్పై వేగంగా ఓ యువకుడు, యువతితో కలిసి ఆంజనేయులు పక్కనుంచి వెళ్లారు. ఆ వేగానికి భయపడ్డ ఆంజనేయులు నెమ్మదిగా వెళ్లాలని సూచించారు.
ఆ మాటకే ఆగ్రహం చెందిన యువకుడు బైక్ ఆపి వచ్చి ఆంజనేయులుపై దాడి చేశాడు. యువకునితో పాటు ఉన్న యువతి ఆపేందుకు యత్నించినా ఆగలేదు. కోపంతో ఆంజనేయులను తోసేయడంతో కింద పడిపోయాడు. తరువాత ఆ యువకుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆంజనేయులు కిందపడ్డప్పుడు రాయికి తగలడంతో తలకు బలమైన గాయమైంది.