Bike Theft Cases in Hyderabad : సర్ నా బైక్ పోయింది. తొందరగా పట్టుకోరా అంటూ ఓ వాహన యజమాని పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేస్తాడు. సరేలే వెతుకుతాం అని చెప్పి అతని చిరునామా తీసుకుని వెళ్లిపో అంటారు పోలీసులు. అప్పుడు ఫిర్యాదుదారుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయండి అని అడిగితే కొన్ని రోజులు చూసి చేద్దాము లే అని సర్ధి చెప్పి అక్కడి నుంచి యజమానిని పంపించేస్తారు. అక్కడి నుంచి ఎన్ని రోజులు గడుస్తున్నా యజమానికి బైక్ సమాచారం అనేది తెలియలేదు. ఇది పోలీసులు బైకు చోరీ కేసుల పరిష్కారంలో చూపుతున్న నిర్లక్ష్యం. ఇప్పుడు దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ క్రమంలో వాహనం పోయిందని ఎవరైనా ఫిర్యాదు చేసినా స్పందన అంతంతమాత్రంగానే ఉంటుందని బాధితులు తెలుపుతున్నారు. ఇది అన్ని ఠాణాలకు వర్తించదు. ఎందుకంటే కొన్ని పోలీస్ స్టేషన్లలలో సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ సీసీ కెమెరాలు తనిఖీ చేయడం, ఇతర ఆధారాలతో దొరబుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నా మెజార్టీ కేసులలో ఇది జరగడం లేదు.
ముఖ్యంగా చెప్పాలంటే ఎఫ్ఐఆర్ నమోదులో విపరీతమైన జాప్యం జరుగుతోందని, ఒకవేళ ఎఫ్ఐఆర్ నమోదైతే వాహనం దొరికాక యజమానికి అప్పగించడానికి కోర్టు అనుమతి, చోరీ చేసిన వ్యక్తిని రిమాండ్కు పంపడం వంటి సమస్యలు వస్తాయని భావించి వేచి చూసే ధోరణికి పోలీసులు అలవాటుపడ్డారు. పోలీసుల ఈజీ ప్రాసెస్కు బాధితులకు చుక్కలు కనిపిస్తున్నాయి. మరికొంత మందైతే వాహన బీమా పాలసీని పొందలేని పరిస్థితి ఎదురవుతుంది.
కేసు లేకుండా ఎదురుచూపులు : హైదరాబాద్ నగరం పరిధిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఏటా 4 వేలకు పైగా వాహనాలు చోరీకి గురవుతున్నాయనేది అంచనా. ఇందులో రికవరీ మాత్రం 50 నుంచి 70 శాతం వరకూ ఉంటోంది. మెజార్టీ కేసుల్లో నిందితులు చిక్కిన సరే ఆ తర్వాత కూపీ లాగినప్పుడే వాహనం గుట్టు అనేది బయటకు వస్తుంది. ఈ బయటకు వచ్చిన సమాచారం ప్రకారం కొన్ని ముఠాలు వ్యవస్థీకృతంగా నడిపిస్తూ చోరీలు చేస్తుంటాయి. ఈ కొట్టేసిన బైకులను విడి భాగాలుగా అమ్ముకోవడం, తక్కువగా మార్చడం, వాహనం కొత్తది, కండీషన్ బాగుంటే ఇతర రాష్ట్రాలు లేదా ఇతర జిల్లాల్లోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ధరకు వాటిని విక్రయిస్తుంటారు. ఇలాంటి కేసులను రికవరీ చేయడం చాలా క్లిష్టతరమైన విషయం అని పోలీసులు చెబుతున్నారు.