Airport Construction Works in Bhogapuram : ఏపీలో ఉత్తరాంధ్ర ప్రగతికి కీలకమైన భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కేంద్రంతో పాటు రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాలు అధికారంలో ఉండటం శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడుకు కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి పదవి వరించడంతో ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి కొత్త రెక్కలు వచ్చాయి.
వైఎస్సార్సీపీ హయాంలో నత్తనడకన సాగిన పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస సమీక్షలు నిర్వహిస్తూ పరుగెత్తిస్తున్నారు. దీంతో 2026 డిసెంబర్ గడువుకు ఆరు నెలల ముందే పనులు పూర్తి చేస్తామని జీఎంఆర్ సంస్థ చెబుతోంది. ఏపీకి ప్రత్యేకించి ఉత్తరాంధ్రకు ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఈ విమానాశ్రయం సత్వరమే పూర్తి కావాలని ప్రజలు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు.
- భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి 2019 ఫిబ్రవరిలో అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ 2023 మే 3న దీనికే రెండోసారి శిలాఫలకం ఆవిష్కరించారు. అంతటికే పరిమితమైపోయిన ఆయన ఇటువైపు తొంగిచూడలేకపోయారు. ఫలితంగా పనుల్లో వేగం మందగించింది.
- సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన నెల రోజులకే ఆయన క్షేత్రస్థాయిలోకి వెళ్లి పనులు పరిశీలించారు. కేంద్ర మంత్రి, ఉన్నతాధికారులు, జీఎంఆర్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మౌలిక వసతులు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. దీంతో అనుకున్న సమయం కంటే ఆరు నెలల ముందే పనులు పూర్తి చేస్తామని వారు చంద్రబాబుకు తెలిపారు.
- రూ.198 కోట్ల వ్యయంతో తారకరామ తీర్థసాగర్ జలాశయం నుంచి విమానాశ్రయానికి నీటి సరఫరా పనులకు అప్పటి ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేశారు. కానీ ప్రభుత్వం మారేంత వరకు రూపాయి కూడా విడుదల చేయలేదు. తాజాగా చంద్రబాబు దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ముందుగా జలాశయం నిర్మాణం పూర్తి చేయించాలని నిర్ణయించారు.
పనుల ప్రగతి ఇలా :
- గత ఏడాది నవంబర్ 1న జీఎంఆర్ సంస్థ భూమి పూజతో పనులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు 41.5 శాతం పనులు పూర్తయ్యాయి. ఇందులో గ్రౌండ్ వర్క్(మట్టి పనులు) 98 శాతం, టెర్మినల్ బిల్డింగ్ 28.56 శాతం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పోల్ 40 శాతం పనులు ఉన్నాయి. ఇప్పటికే రన్‌వేకు ఒక రూపు తీసుకొచ్చారు. టాక్సీవే, యాప్రాన్, ఎయిర్ ఫీల్డ్ గ్రౌండ్ లైటింగ్ పనులు ప్రారంభించారు. జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాలకు ఇబ్బంది లేకుండా అనుసంధాన రహదారిని కలిపేందుకు ‘8’ సంఖ్య ఆకారంలో ట్రంపెట్ నిర్మాణానికి 25 ఎకరాలు సేకరించారు. ముక్కం పంచాయతీ పరిధిలో 5.47 ఎకరాల్లో ప్రత్యేకంగా విద్యుత్ ఉపకేంద్రాన్ని, విమానాశ్రయ అధికారులు, సిబ్బందికి నివాస గృహ సముదాయాన్ని నిర్మించనున్నారు.
- ఎయిర్‌పోర్ట్ నిర్మాణంలో కీలకమైన టెర్మినల్ భవనాన్ని ఈ సంవత్సరం డిసెంబర్‌కు పూర్తి చేయనున్నారు. విమానాశ్రయ నిర్మాణానికి సేకరించిన భూమిలో వైఎస్సార్సీపీ సర్కార్ 500 ఎకరాలు పక్కన పెట్టింది. అయితే ఆ భూములను తిరిగి నిర్మాణ సంస్థకే అప్పగించడానికి చంద్రబాబు సూత్రప్రాయంగా అంగీకరించారు.
- తొలి విడత వ్యయం: రూ.4,502 కోట్లు
- సేకరించిన భూమి: 2,703 ఎకరాలు
- జీఎంఆర్‌కు అప్పగించిన భూములు: 2,203 ఎకరాలు
- వైఎస్సార్సీపీ పాలనలో పక్కన పెట్టినవి: 500 ఎకరాలు